1200 ఏళ్ల నాటి పవిత్ర ఆలయంలో ప్రియాంక-శివ వివాహం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నటి!

by Mallepaka Hamsa |

మేము ఎప్పటి నుంచో పెళ్లి ప్లాన్ చేస్తున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే మా పెళ్లి ఎక్కడ జరగాలి అనే విషయంలో మాత్రం మాకు ఒక స్పష్టత ఉంది

1200 ఏళ్ల నాటి పవిత్ర ఆలయంలో ప్రియాంక-శివ వివాహం.. ఆసక్తికర విషయాలు వెల్లడించిన నటి!
X

దిశ, సినిమా: బుల్లితెరపై ఫుల్ ఫేమ్ రాబట్టుకున్న జంటల్లో ప్రియాంక జైన్, శివకుమార్ ఒకరు. ‘మౌనరాగం’ సీరియల్ ద్వారా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారి, గత కొన్నేళ్లుగా ఈ జంట సహజీవనం చేస్తోంది. అయితే వీరిద్దరూ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. తాజాగా ‘మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్’ అనే రియాలిటీ షోలో పాల్గొన్న ఈ జంట, తమ వివాహంపై వస్తున్న పుకార్లకు చెక్ పెడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది. ప్రేమ జంటల బంధాన్ని పరీక్షించే ఈ షోలో మొత్తం 10 జంటలు ఒక అందమైన మాన్షన్‌లో పోటీ పడుతున్నాయి. ఇందులో మొదటి జంటగా ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక-శివను యాంకర్ రాధ ఒక ప్రశ్న అడిగారు.

"మీ పెళ్లి ఎప్పుడు? ఎందుకు ఆలస్యం అవుతోంది?" అని అడగ్గా.. ప్రియాంక చాలా ఎమోషనల్ గా స్పందించింది. "మేము ఎప్పటి నుంచో పెళ్లి ప్లాన్ చేస్తున్నాం, కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తోంది. అయితే మా పెళ్లి ఎక్కడ జరగాలి అనే విషయంలో మాత్రం మాకు ఒక స్పష్టత ఉంది" అని చెప్పింది. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ త్రియుగి నారాయణ్ ఆలయంలో తాము ఒక్కటవుతామని ప్రియాంక వెల్లడించింది. ఈ ఆలయానికి హిందూ పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. సాక్షాత్తు శివపార్వతుల వివాహం ఇక్కడే జరిగిందని భక్తుల నమ్మకం. ఆ వివాహ సమయంలో వెలిగించిన అఖండ అగ్ని మూడు యుగాలుగా ఇంకా వెలుగుతూనే ఉండటం ఇక్కడి ప్రత్యేకత.

ఆ పవిత్ర అగ్ని సాక్షిగానే తాము కూడా వివాహం చేసుకుంటామని ఈ జంట చెప్పుకొచ్చింది. ఈ ఆలయం రుద్రప్రయాగ్ జిల్లాలో సముద్ర మట్టానికి సుమారు 1980 మీటర్ల ఎత్తులో ఉంది. పురాణాల ప్రకారం, పార్వతీ దేవికి శ్రీ మహావిష్ణువు అన్నగా ఉండి కన్యాదానం చేసిన ప్రదేశం ఇదే. సుమారు 1200 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ ఆలయం సోన్ ప్రయాగ్‌కు సమీపంలో ఉంటుంది. ఇంతటి పవిత్రమైన చోట, మూడు యుగాల నాటి అగ్ని సాక్షిగా పెళ్లి చేసుకోవాలనే వీరి నిర్ణయంపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. దేవుడు కరుణించి త్వరలోనే ఈ జంట ఒకటవ్వాలని కోరుకుంటున్నారు.

Next Story