టబు, అక్షయ్ కుమార్ వివాదంపై స్పందించిన ప్రియదర్శన్.. ఇలాంటివి చేస్తున్నందుకు సిగ్గుపడాలంటూ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |

సినిమా అద్భుతంగా ఆడుతుంటే, కొందరు కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. టబుకు, నాకు మధ్య ఎనిమిది సినిమాల అనుబంధం ఉంది.

టబు, అక్షయ్ కుమార్ వివాదంపై స్పందించిన ప్రియదర్శన్.. ఇలాంటివి చేస్తున్నందుకు సిగ్గుపడాలంటూ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ కాంబినేషన్‌లో సుమారు 14 ఏళ్ల తర్వాత వచ్చిన హారర్ కామెడీ చిత్రం ‘భూత్ బంగ్లా’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తూ బ్లాక్ బస్టర్ హిట్ దిశగా దూసుకుపోతోంది. కేవలం రెండు వారాల్లోనే ఈ చిత్రం రూ. 120 కోట్లకు పైగా వసూళ్లను సాధించి అక్షయ్ కుమార్‌కు మంచి కంబ్యాక్ ఇచ్చింది. అయితే, ఇంతటి ఘనవిజయం సాధించిన ఈ సినిమా చుట్టూ ఇప్పుడు ఒక వివాదం నెలకొంది. ఈ సినిమాలో సీనియర్ నటి టబు ఒక కీలక పాత్ర పోషించారు. అయితే, ఎడిటింగ్‌లో ఆమె పాత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను కావాలనే తొలగించారని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనికి తోడు, అక్షయ్ కుమార్, టబుకు మధ్య విభేధాలు ఉన్నాయని, ఆ కారణంగానే అక్షయ్ దగ్గరుండి మరీ ఆమె సీన్లను కట్ చేయించారని కొందరు నెటిజన్లు తీవ్రంగా విమర్శిస్తున్నారు.

ఈ వివాదంపై దర్శకుడు ప్రియదర్శన్ తాజాగా స్పందిస్తూ నెగెటివిటీని సృష్టించే వారిపై నిప్పులు చెరిగారు. "సినిమా అద్భుతంగా ఆడుతుంటే, కొందరు కావాలనే ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. టబుకు, నాకు మధ్య ఎనిమిది సినిమాల అనుబంధం ఉంది. ఆమెకు ఏమైనా ఇబ్బంది ఉంటే నేరుగా నాకే చెబుతారు. ఈ సినిమా విషయంలో ఆమె చాలా సంతోషంగా ఉన్నారు" అని ఆయన స్పష్టం చేశారు. ఎడిటింగ్ విషయంలో అక్షయ్ కుమార్ పాత్ర ఉందన్న వార్తలను ప్రియదర్శన్ పూర్తిగా ఖండించారు. "సినిమాలో ఏ సీన్ ఉంచాలి, ఏది తీసేయాలి అనేది దర్శకుడిగా నా నిర్ణయం. అక్షయ్ కుమార్ ఎప్పుడూ నా పనిలో జోక్యం చేసుకోలేదు. అసలు సినిమా విడుదల కాకముందే నటీనటులందరూ ఫైనల్ కాపీని చూశారు. అప్పుడు లేని అభ్యంతరం ఇప్పుడు ఎందుకు ఉంటుంది? ఇలాంటి అబద్ధపు ప్రచారాలు చేస్తున్న వారు సిగ్గుపడాలి" అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story