- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు.. అనుకున్న సమయానికే ‘లెనిన్’ వస్తుందంటూ నాగార్జున పోస్ట్
‘పెద్ది’ సినిమా కూడా జూన్ 25కు వాయిదా పడిందనే వార్తలు రావడంతో, అఖిల్ మళ్ళీ వెనక్కి తగ్గుతారనే పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేశాయి.

దిశ, సినిమా: అక్కినేని యంగ్ హీరో అఖిల్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం ‘లెనిన్’. దాదాపు మూడేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అఖిల్ నుండి వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ‘మిస్టర్ బచ్చన్’ ఫేమ్ భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తోంది. అయితే, ఈ సినిమా విడుదల తేదీ విషయంలో గత కొన్ని రోజులుగా సందిగ్ధత నెలకొన్న నేపథ్యంలో, తాజాగా కింగ్ నాగార్జున స్వయంగా రంగంలోకి దిగి క్లారిటీ ఇచ్చారు. నిజానికి ‘లెనిన్’ సినిమా మే 1న విడుదల కావాల్సి ఉంది. కానీ, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ ఏప్రిల్ 30న వస్తుండటంతో, అనవసరమైన పోటీ ఎందుకని భావించి అప్పట్లో జూన్ 26కు వాయిదా వేశారు. అయితే, ఇప్పుడు ‘పెద్ది’ సినిమా కూడా జూన్ 25కు వాయిదా పడిందనే వార్తలు రావడంతో, అఖిల్ మళ్ళీ వెనక్కి తగ్గుతారనే పుకార్లు సోషల్ మీడియాలో షికారు చేశాయి. ఈ పుకార్లకు చెక్ పెడుతూ నాగార్జున ట్విట్టర్ వేదికగా ఒక పవర్ ఫుల్ ప్రకటన విడుదల చేశారు.
"నేను నిన్న రాత్రి 'లెనిన్' సినిమా ఫస్ట్ కట్ చూశాను. అది చూసిన తర్వాత ఎంతో నమ్మకంతో ఈ మాట చెబుతున్నాను. అనుకున్న షెడ్యూల్ ప్రకారమే లెనిన్ జూన్ 26న ప్రేక్షకుల ముందుకు వస్తుంది. వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు" అని నాగార్జున ట్వీట్ చేశారు. సినిమా అవుట్‌పుట్ పట్ల నాగ్ చూపిస్తున్న ఈ ధీమా అక్కినేని అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. రామ్ చరణ్ వంటి పెద్ద హీరో సినిమా పోటీలో ఉన్నప్పటికీ, కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే నాగార్జున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అర్థమవుతోంది. ఈ చిత్రం చిత్తూరు నేపథ్యంలో సాగే ఒక పీరియడ్ డ్రామా అని తెలుస్తోంది. బలమైన భావోద్వేగాలు ఆసక్తిని రేకెత్తించే కథనంతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచేలా ఈ సినిమాను తీర్చిదిద్దారు. చిత్తూరు యాస, అక్కడి మట్టి వాసన ఉట్టిపడేలా అఖిల్ పాత్ర ఉండబోతోందని సమాచారం. అఖిల్ తన కెరీర్‌లో ఇప్పటివరకు చేయని ఒక విభిన్నమైన పాత్రలో ఈ సినిమాలో కనిపించబోతున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నాగార్జున, నాగవంశీ నిర్మిస్తున్నారు.






