నా నవ్వు వెనుక ఉన్న కష్టాలు ఎవరికీ తెలియవు.. హంసానందిని ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

నాది బలమైన వెన్నెముక.. మృదువైన హృదయం. నా నవ్వు ఎప్పుడూ బిగ్గరగానే ఉంటుంది. నా నవ్వు వెనుక ఉన్న కష్టాలు ఎవరికీ తెలియవు.

నా నవ్వు వెనుక ఉన్న కష్టాలు ఎవరికీ తెలియవు.. హంసానందిని ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ వెండితెరపై తన అందచందాలతో, చురుకైన నటనతో మెప్పించిన హంసా నందిని గత కొంతకాలంగా సినిమాలకు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా క్యాన్సర్ వంటి మహమ్మారితో పోరాడి, ఆ గండం నుంచి గెలిచి బయటపడింది. తాజాగా హంసా నందిని ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఒక ఎమోషనల్ పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతూ అందరినీ ఆలోచింపజేస్తోంది. తన జీవిత ప్రయాణం గురించి హంసా నందిని చాలా లోతైన మాటలు రాసుకొచ్చింది. ‘‘నాది బలమైన వెన్నెముక.. మృదువైన హృదయం. నా నవ్వు ఎప్పుడూ బిగ్గరగానే ఉంటుంది. నా నవ్వు వెనుక ఉన్న కష్టాలు ఎవరికీ తెలియవు. నా జీవితంలో నేను లెక్కలేనన్ని సార్లు విరిగిపోయాను.

కానీ ప్రతిసారీ నన్ను నేను పునర్నిర్మించుకున్నాను.. తిరిగి జన్మించాను’’ అని పేర్కొంది. కష్టాలు ఎదురైనప్పుడు కుంగిపోకుండా, మళ్ళీ కొత్త ఉత్సాహంతో ఎలా నిలబడాలో తన అనుభవంతో వివరించింది. మనం ఎప్పుడూ ఇతరుల కళ్లలో పరిపూర్ణంగా కనిపించాలని తాపత్రయ పడతామని, కానీ అది ముఖ్యం కాదని హంసా తెలిపింది. ‘‘నేను ఇక్కడికి పరిపూర్ణంగా ఉండటానికి రాలేదు. పూర్తిగా జీవించడానికి, తీవ్రంగా ప్రేమించడానికి వచ్చాను. నేను ఎలా ఉండాలని ఉద్దేశించానో, అలా నాకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకోవడానికి ఇక్కడే ఉన్నాను’’ అని స్పష్టం చేసింది. తనకంటూ ఒక కథను కలిగి ఉండి, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ముందుకు సాగుతున్న ప్రతి స్త్రీకి ఆమె ఈ పోస్ట్‌ను అంకితం ఇచ్చింది.

మహిళలు అంటే కేవలం సున్నితమైన వారు మాత్రమే కాదని హంసా నందిని పవర్‌ఫుల్ మెసేజ్ ఇచ్చింది. మనం కేవలం సున్నితమైన వాళ్లం కాదు. మనం చాలా ప్రమాదకరమైన రీతిలో బతికే ఉన్నాము అని రాసుకొచ్చింది. అంటే ఎన్ని ప్రాణాంతక సమస్యలు ఎదురైనా, వాటన్నింటినీ ఎదిరించి నిలబడే ధైర్యం మహిళలకు ఉందని ఆమె ఉద్దేశం. గజిబిజిగా, మాయాజాలంలా ఉండే తన జీవితాన్ని గర్వంగా ఓన్ చేసుకుంటున్నట్లు ఆమె వెల్లడించింది. హంసా నందిని చేసిన ఈ పోస్ట్‌కు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఆమెను మెచ్చుకుంటూ, తిరిగి సినిమాల్లోకి రావాలని కోరుకుంటున్నారు.

Next Story