నన్ను జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదు.. ట్రోలర్ల నోళ్ళు మూయించిన స్వరా భాస్కర్.. షాకింగ్ పోస్ట్

by Mallepaka Hamsa |

మహిళల శరీరాలు కేవలం గ్లామర్ కోసమో లేక ఇతరులకు ఆకర్షణీయంగా కనిపించడానికో మాత్రమే కాదు అని ఆమె ఘాటుగా స్పందించారు.

నన్ను జడ్జ్ చేసే హక్కు ఎవరికీ లేదు.. ట్రోలర్ల నోళ్ళు మూయించిన స్వరా భాస్కర్.. షాకింగ్  పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటి స్వరా భాస్కర్ మరోసారి తనదైన శైలిలో సోషల్ మీడియా వేదికగా నెటిజన్లకు గట్టి సమాధానం ఇచ్చారు. గర్భధారణ తర్వాత తన శరీరంలో వచ్చిన మార్పుల గురించి, పెరిగిన బరువు గురించి కొందరు చేస్తున్న అసభ్యకరమైన కామెంట్లను ఆమె తీవ్రంగా ఖండించారు. 2023లో రాజకీయ కార్యకర్త ఫహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకున్న స్వరా, అదే ఏడాది సెప్టెంబర్‌లో పాప రాబియాకు జన్మనిచ్చారు. తను తల్లి కావడానికి ముందు, తల్లి అయిన తర్వాత ఉన్న ఫోటోలను ఒక దగ్గర చేర్చి పోస్ట్ చేస్తూ.. తను ఎదుర్కొంటున్న మానసిక వేధింపుల గురించి స్వరా మాట్లాడారు. "గత రెండేళ్లుగా నా శరీరంపై వస్తున్న విమర్శలు, అసహ్యం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోంది. ఇంటర్నెట్‌లో ఎవరో అపరిచితులు నిర్దేశించిన సమయం ప్రకారం నేను బరువు తగ్గాలని కోరుకోవడం విడ్డూరం. మహిళల శరీరాలు కేవలం గ్లామర్ కోసమో లేక ఇతరులకు ఆకర్షణీయంగా కనిపించడానికో మాత్రమే కాదు" అని ఆమె ఘాటుగా స్పందించారు.

సాధారణంగా సెలబ్రిటీలు డెలివరీ తర్వాత వెంటనే బరువు తగ్గి పాత రూపంలోకి రావడాన్ని గొప్పగా చూస్తుంటారు. కానీ స్వరా దీనిని తీవ్రంగా వ్యతిరేకించారు. "నా బిడ్డ పుట్టిన తర్వాత నేను మళ్ళీ పాత రూపంలోకి వెళ్లకూడదని నిర్ణయించుకున్నాను. ఒకసారి తల్లి అయ్యాక జీవితం ప్రాథమికంగా మారుతుంది. మన శరీరం ఒక కొత్త ప్రాణాన్ని మోసి, పెంచి, ఈ లోకానికి ఇచ్చింది. అటువంటప్పుడు ఆ శరీరం మారడం సహజం, అది ఏమాత్రం తప్పు కాదు. పాత ఫోటోల్లో లాగా సన్నగా కనిపించాలని మనల్ని మనం ఒత్తిడికి గురిచేసుకోవడం ఒక రకమైన క్రూరత్వం" అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. కెమెరా ముందు అందంగా ఉండాలనే నిరంతర ఒత్తిడిని ఆమె తప్పుబట్టారు. మహిళలు తమ శరీరాన్ని ఎలా ఉంచుకోవాలి అనేది వారి వ్యక్తిగత విషయమని, దాని గురించి ఎవరూ తీర్పు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. "ఇది ఫిట్‌నెస్‌కు వ్యతిరేకంగా చేస్తున్న వాదన కాదు. మన శరీరం ఇచ్చిన గొప్ప కానుకను గౌరవించమని చెబుతున్నాను. సమాజం పెట్టే చిన్న బాక్సుల్లో మహిళలు ఇమడాల్సిన అవసరం లేదు" అని స్వరా రాసుకొచ్చారు. కాగా.. స్వరా భాస్కర్, ఫహద్ అహ్మద్‌లు ఒక రాజకీయ ర్యాలీలో మొదటిసారి కలుసుకున్నారు. వీరిద్దరూ కలిసి అనేక నిరసన ప్రదర్శనల్లో పాల్గొని తమ గళాన్ని వినిపించారు. చివరకు 2023 ఫిబ్రవరిలో పెళ్లి చేసుకున్న ఈ దంపతులు, సెప్టెంబర్ 23న రాబియా పుట్టినప్పుడు తమ సంతోషాన్ని పంచుకున్నారు.

Next Story