పరవళ్లు తొక్కుతున్న గోదావరి.. ధవళేశ్వరం వద్ద నిండుకుండను తలపిస్తోన్న నది

by Naga Rani Yarlagadda |

వేసవిలో నదిలో నీరు లేక ధవళేశ్వరం వద్ద వెలవెలబోయిన గోదావరి.. ప్రస్తుతం ఎగువన కురుస్తోన్న వర్షాలతో జలకళ సంతరించుకుంది.

పరవళ్లు తొక్కుతున్న గోదావరి.. ధవళేశ్వరం వద్ద నిండుకుండను తలపిస్తోన్న నది
X

దిశ, వెబ్‌డెస్క్: వేసవిలో నదిలో నీరు లేక ధవళేశ్వరం వద్ద వెలవెలబోయిన గోదావరి.. ప్రస్తుతం ఎగువన కురుస్తోన్న వర్షాలతో జలకళ సంతరించుకుంది. రాజమండ్రిలో ఉన్న ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నది నిండుకుండలా కనిపిస్తోంది. గోదావరికి క్రమంగా వరద పెరుగుతుండగా.. అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం వద్ద గోదావరి నది మునుపెన్నడూ లేనిరీతిలో సరికొత్త రూపాన్ని సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తోన్న కొత్తనీరు నది నీటిలో కలుస్తుండగా.. నీలి, ఎరుపు రంగులతో గోదావరి కనువిందు చేస్తోంది. ఈ దృశ్యాన్ని చూసేందుకు పర్యాటకులు, స్థానికులు నదీతీరం వద్దకు చేరుకుంటున్నారు.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద నది నీటిమట్టం గంటగంటకు పెరుగుతుండటంతో అధికారులు అలర్టయ్యారు. బ్యారేజీ వద్ద నీటిమట్టం 10.90 అడుగులకు చేరగా.. ఎగువ నుంచి ధవళేశ్వరం బ్యారేజీకి 60,933 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. బ్యారేజీ నుంచి ఔట్ ఫ్లో 57,387 క్యూసెక్కులుగా ఉండగా.. 13,600 క్యూసెక్కుల నీటిని కాలువలకు వదులుతున్నారు. బ్యారేజీ గేట్లను ఎత్తి 43,387 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరి జలకళ సంతరించుకోవడంతో.. రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Next Story