‘నా పెళ్ళాం నిప్పురా’ అంటూ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పోస్ట్.. జాగ్రత్త అంటూ నెటిజన్ల హెచ్చరిక

by Mallepaka Hamsa |

బ్రదర్.. నిప్పుతో ఆటలు వద్దు, జాగ్రత్త! ఈ మధ్య చాలామంది భర్తలు ఆ నిప్పులోనే తగలడిపోతున్నారు అంటూ సెటైర్లు వేస్తున్నారు.

‘నా పెళ్ళాం నిప్పురా’ అంటూ బెల్లంకొండ సాయిశ్రీనివాస్ పోస్ట్..  జాగ్రత్త అంటూ నెటిజన్ల హెచ్చరిక
X

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ కుమారుడిగా ‘అల్లుడు శ్రీను’ చిత్రంతో ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. మాస్ యాక్షన్ సినిమాలతో అలరించే ఈ యంగ్ హీరో, తాజాగా తన వ్యక్తిగత జీవితంలో కొత్త అధ్యాయాన్ని మొదలుపెట్టారు. గత కొద్దిరోజులుగా తన పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉన్న శ్రీనివాస్, తన ప్రియురాలు కావ్యను వివాహం చేసుకుని ఒక ఇంటివారయ్యారు. ఏప్రిల్ 29న పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతిలో శ్రీనివాస్-కావ్యల వివాహం అత్యంత వైభవంగా జరిగింది. అతికొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. తిరుపతిలో పెళ్లి కావడంతో టాలీవుడ్ ప్రముఖులు ఎక్కువమంది హాజరు కాలేకపోయారు. దీనికోసం హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు దిగ్గజ తారలంతా హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. ముఖ్యంగా స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

రిసెప్షన్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ శ్రీనివాస్ తన భార్య గురించి ఎంతో ఎమోషనల్‌గా రాసుకొచ్చారు. "ఇప్పటివరకు నేను కనుగొన్న వాటన్నింటి కంటే గొప్ప నిధిని కనుగొన్నాను. ప్రపంచమా.. నా భార్యను కలుసుకోండి" అంటూ పరిచయం చేశారు. అయితే, ఆయన పెట్టిన క్యాప్షన్ కంటే, తన పాత సినిమా ‘జయ జానకి నాయక’లోని ఫేమస్ డైలాగ్‌ను రిక్రియేట్ చేస్తూ "నా పెళ్ళాం నిప్పురా" అని అనడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.శ్రీనివాస్ తన భార్యను నిప్పుతో పోల్చడంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు మీమ్స్ తో హల్ చల్ చేస్తుంటే, మరికొందరు ఫన్నీగా హెచ్చరిస్తున్నారు. "బ్రదర్.. నిప్పుతో ఆటలు వద్దు, జాగ్రత్త! ఈ మధ్య చాలామంది భర్తలు ఆ నిప్పులోనే తగలడిపోతున్నారు" అంటూ సెటైర్లు వేస్తున్నారు. ఏదేమైనా బెల్లంకొండ శ్రీనివాస్ తన పెళ్లి ఫోటోలతో ప్రస్తుతం ఇంటర్నెట్‌ను ఊపేస్తున్నారు.

Next Story