సంగీతమే నా మందు.. పని ఒత్తిడిలోనూ ప్రశాంతతను వెతుక్కుంటున్న అమితాబ్ బచ్చన్

by Mallepaka Hamsa |

నిద్రలేని ఆ రాత్రులలో తనకు సంగీతం ఎంతో ప్రశాంతతను ఇస్తుందని అమితాబ్ తెలిపారు.

సంగీతమే నా మందు.. పని ఒత్తిడిలోనూ ప్రశాంతతను వెతుక్కుంటున్న అమితాబ్ బచ్చన్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్ వయసు కేవలం అంకె మాత్రమేనని నిరూపిస్తూ, 83 ఏళ్ల వయసులో కూడా తన పని పట్ల చూపిస్తున్న అంకితభావం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. తీరికలేని పని ఒత్తిడి వల్ల ఇటీవల తనకు నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయని ఆయన సోషల్ మీడియాలో పంచుకున్న విషయాలు వైరల్ అవుతున్నాయి. "వైద్యులు చెప్పేది నిజమే కావచ్చు, కానీ నాకు నిద్ర కంటే పనే ముఖ్యం. మరి ఇలాంటి సమయంలో ఒక మనిషి ఏం చేయాలి?" అంటూ ఆయన రాసుకొచ్చారు. నిద్రలేని ఆ రాత్రులలో తనకు సంగీతం ఎంతో ప్రశాంతతను ఇస్తుందని అమితాబ్ తెలిపారు.

ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో గిటార్, సితార్ వంటి వాయిద్యాల నుండి వచ్చే శాస్త్రీయ సంగీతం తన ఆత్మకు ఉపశమనం కలిగిస్తుందని ఆయన పేర్కొన్నారు. "సంగీతం అనేది మన ఆత్మను ఆ దేవుడితో కలిపే ఒక అదృశ్య దారం. లోకంలో ఎక్కడైనా సరే ఆ ఏడు స్వరాలే సంగీతానికి ఆధారం. సంగీతాన్ని మనం గౌరవిస్తే, అది మనకు ప్రశాంతతను ఇస్తుంది" అని ఆయన సంగీతంపై తనకున్న ప్రేమను చాటుకున్నారు. కాగా.. అమితాబ్ బచ్చన్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ఆయన ‘కల్కి 2898 AD’ చిత్రంలో అశ్వత్థామగా నటించి మెప్పించారు. నాగ్‌ అశ్విన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్, దీపికా పదుకొణె, కమల్ హాసన్ వంటి స్టార్లతో కలిసి ఆయన చేసిన నటనకు ప్రశంసలు దక్కాయి. ఇప్పటికీ వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంటూ, యంగ్ హీరోలకు గట్టిపోటీనిస్తున్నారు.

Next Story