గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్.. మా బాస్ మనసు బంగారం అంటూప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |

చరణ్ పుట్టినరోజున ఆ పది లక్షల రూపాయలను వివిధ రంగాల్లో సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు (NGOs) సమానంగా పంపిణీ చేశారు.

గొప్ప మనసు చాటుకున్న మెగాస్టార్.. మా బాస్ మనసు బంగారం అంటూప్రశంసలు కురిపిస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ఒక గొప్ప వ్యక్తిత్వం అని చిరంజీవి మరోసారి నిరూపించారు. తన కుమారుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు వేడుకలను కేవలం ఆర్భాటాలకే పరిమితం చేయకుండా, సమాజంలోని నిస్సహాయులకు భరోసా కల్పించారు. తండ్రిగా కొడుకు పుట్టినరోజున ఇంతకంటే గొప్ప బహుమతి ఏముంటుంది అనిపించేలా, లక్షలాది మంది అభిమానుల హృదయాలను చిరంజీవి గెలుచుకున్నారు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చిరంజీవికి అత్యున్నతమైన ‘ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని’ అందజేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ పురస్కారం కింద ప్రభుత్వం ఆయనకు ₹10 లక్షల నగదును అందజేసింది. అయితే, ఆ డబ్బును తన స్వంతానికి వాడుకోకుండా, సమాజ సేవ కోసం వినియోగించాలని చిరంజీవి నిర్ణయించుకున్నారు. చరణ్ పుట్టినరోజున ఆ పది లక్షల రూపాయలను వివిధ రంగాల్లో సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థలకు (NGOs) సమానంగా పంపిణీ చేశారు.

అనాథలైన వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తూ వారి బాగోగులు చూస్తున్న సర్వ్ ఫౌండేషన్ సంస్థకు విరాళం ఇచ్చారు. అలాగే చూపులేని చిన్నారులకు విద్య, వైద్యం అందిస్తున్న దేవనార్ ఫౌండేషన్ సంస్థకు అండగా నిలిచారు. అనాథ పిల్లల సంరక్షణ బాధ్యతలు తీసుకుంటున్న వాల్మీకి నయశ్రీ ఫౌండేషన్ సంస్థకు సహాయం చేశారు. క్యాన్సర్ రోగుల చికిత్స కోసం ఈ ఆస్పత్రికి కూడా భారీ విరాళం అందజేశారు. ఈ వేడుకల్లో మరో మరుపురాని ఘట్టం ఏమిటంటే.. ఇటీవల రామ్ చరణ్ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో కొందరు వృద్ధులు ఆయనను కలిసి ఆశీర్వదించారు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకున్న చిరంజీవి, వారందరినీ ప్రత్యేకంగా తన బ్లడ్ బ్యాంక్‌కు ఆహ్వానించారు. కేవలం వారిని పిలవడమే కాకుండా, వారందరికీ కొత్త బట్టలు పంపిణీ చేశారు. ఆ తర్వాత వారితో కలిసి సమయం గడిపి, స్వయంగా తనే వడ్డిస్తూ భోజనం పెట్టారు. మెగాస్టార్ వంటి స్టార్ హీరో తమకు స్వయంగా భోజనం వడ్డించడం చూసి ఆ వృద్ధులు ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతుండటంతో మెగా అభిమానులు ‘మా బాస్ మనసు బంగారం’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Next Story