నేను తప్పక అలా చేయాల్సి వచ్చిందంటూ తనూజకు బహిరంగ క్షమాపణలు చెప్పిన కామనర్.. పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |

బిగ్‌బాస్ సీజన్-9 పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ ఎంతోమంది ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు.

నేను తప్పక అలా చేయాల్సి వచ్చిందంటూ తనూజకు బహిరంగ క్షమాపణలు చెప్పిన కామనర్.. పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: బిగ్‌బాస్ సీజన్-9 పూర్తి అయినప్పటికీ ఇప్పటికీ ఎంతోమంది ఇందులో పాల్గొన్న కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటున్నారనడంలో అతిశయోక్తి లేదు. తొందరగా అయిపోయిందని కొందరు చాలా బాధపడిపోతున్నారు కూడా. ఇదిలా ఉంటే.. ఈ షోలో పాల్గొన్న కామనర్ మర్యాద మనీష్ అందరికీ సుపరిచితమే. ఇంట్లోకి వెళ్లి రెండో వారానికే ఎలిమినేట్ అయి బయటకు వచ్చేశాడు. కానీ నామినేషన్స్‌లో మళ్లీ లోపలికి వెళ్లి తనూజపై షాకింగ్ కామెంట్ చేశాడు. ముద్దు మాటలతో చెవిలో ముద్ద మందారం పూలు పెడుతుందని అన్నాడు. దీంతో ఆయనపై విమర్శలు వచ్చాయి. అయితే ఫైనల్ ఎపిసోడ్‌లో తనూజ ఈ విషయంపై స్పందిస్తూ.. మర్యాత మనీష్ మాటలు తనను ఎంతగానో బాధించాయని చెప్పింది. తాను అతని నుంచి క్షమాపణలు కూడా కోరుతున్నట్లు చెప్పడంతో ఈ విషయంపై స్పందించిన మనీష్ ఇన్‌స్టాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ‘‘ప్రియమైన తనూజ పుట్టస్వామి మీ ఆట గురించి ఎక్కడ నుండి మొదలుపెట్టాలో, ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. 105 రోజుల పాటు, ఇంత తెలివైన, అద్భుతమైన ఆట ఆడటం దాదాపు అసాధ్యం.

కానీ మీరు అది చేసి చూపించారు. మీరు ఉధృతంగా, బలంగా పోరాడారు. ఈ సీజన్‌లో నాకు ఇష్టమైన టాప్ 5 ఆటగాళ్లలో మీరు ఎప్పుడూ ఉండేవారు. నేను కొన్నిసార్లు మీకు ఓటు కూడా వేశాను. నాకు చదరంగం అంటే చాలా ఇష్టం. చదరంగంలో రాణి అత్యంత శక్తివంతమైన క్రీడాకారిణి, ఆట గెలవడానికి అందరూ ముందుగా రాణిపై దాడి చేయాలనుకుంటారు. రాణి ఓడిపోతే ఆటను కూడా వదిలేస్తారు. నాకు రీ-ఎంట్రీకి అవకాశం వచ్చినప్పుడు నేను మీతోనే ఆడాల్సి వచ్చింది. ఎందుకంటే మీరు రాణి ఈ సీజన్‌లోని అత్యంత బలమైన క్రీడాకారులలో ఒకరు. ఇంట్లో, బయట ప్రజల మధ్య కూడా! కానీ ఫినాలే సమయంలో నా మాటలకు మీరు బాధపడ్డారని మీరు చెప్పినప్పుడు, నాకు మైక్ దొరికి ఉంటే నేను ఆ షోలోనే మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పేవాడిని. మనం కలిసినప్పుడు నేను మొదటగా అదే చేశాను. కానీ మళ్ళీ, బహిరంగంగా కూడా మరోసారి క్షమాపణ చెప్పడానికి సంతోషిస్తాను. ఎందుకంటే మనమందరం చేసినదంతా ఆట కోసమే! క్షమాపణ చెప్పడం వల్ల ఎవరూ చిన్నవారు లేదా పెద్దవారు కారు. ఇది ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం స్నేహ హస్తం అందించడమే.

నేను మీకు ఒక విషయం కోసం ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. 9వ రోజున నేను ఇంట్లో చాలా ఒంటరిగా భావించాను. అది చూసిన మీరు నా దగ్గరకు వచ్చి నాతో మాట్లాడారు. భరణి గారిని కూడా నాతో పాటు కూర్చోమని అడిగారు. ఈ చిన్న చిన్న దయగల పనులను నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఫైనల్ వరకు మీరు బిగ్ బాస్ అభిమానులు చివరి వరకు గుర్తుంచుకునే ఆట ఆడారు. మీరు చాలా మంది ప్రజల హృదయాలను గెలుచుకున్నారు. వారు సంతోషంగా మీపై పూల వర్షం కురిపిస్తారు. మీకు శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో మీరు అద్భుతంగా రాణిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. పూలు కూడా పెట్టుకోలేని మనిషి (షోలో నేను మీ గురించి వాడిన మాటలను సమతుల్యం చేయడానికి నాపై నేను చేసుకున్న చిన్న వ్యంగ్యం)’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా తనూజతో దిగిన ఫొటోను షేర్ చేశాడు.

Next Story