అరుంధతిలా మారి భర్తను కిడ్నాప్ చేసిన లావణ్య త్రిపాఠి.. ‘సతీ లీలావతి’ ట్రైలర్ అదిరిపోయిందిగా!

by Mallepaka Hamsa |

కథలో ట్విస్ట్ ఏంటంటే, నరేష్ తన అల్లుడు ఎక్కడ అని అడగ్గా.. లావణ్య తన భర్తను తానే కిడ్నాప్ చేసి, ఏమీ తెలియనట్లుగా నటించడం చాలా వినోదాత్మకంగా ఉంది.

అరుంధతిలా మారి భర్తను కిడ్నాప్ చేసిన లావణ్య త్రిపాఠి.. ‘సతీ లీలావతి’ ట్రైలర్ అదిరిపోయిందిగా!
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్, మెగా కోడలు లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘సతీ లీలావతి’. గతంలో ‘భీమిలీ కబడ్డి జట్టు’, ‘ఎస్.ఎం.ఎస్’ వంటి వైవిధ్యమైన చిత్రాలను అందించిన దర్శకుడు తాతినేని సత్య ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అయితే లావణ్య త్రిపాఠి పెళ్లై, ఒక బాబుకు జన్మనిచ్చిన తర్వాత ఈ మూవీతో తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయనుండటం విశేషం. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో, దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ సినిమా మే 8న థియేటర్లలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో చిత్రబృందం తాజాగా విడుదల చేసిన ట్రైలర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. భార్యాభర్తల మధ్య జరిగే సరదా గొడవలు, కిడ్నాప్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్ ప్రారంభంలో సీనియర్ నటుడు నరేష్, లావణ్యతో చెబుతూ.. "20 ఏళ్ల నా పెంపకంలో కనబడని నవ్వు.. మూడేళ్ల మీ సంసార జీవితంలో నీ మొఖంలో కనిపిస్తోంది" అనే డైలాగ్ చాలా హాయిగా అనిపిస్తుంది.

కథలో ట్విస్ట్ ఏంటంటే, నరేష్ తన అల్లుడు ఎక్కడ అని అడగ్గా.. లావణ్య తన భర్తను తానే కిడ్నాప్ చేసి, ఏమీ తెలియనట్లుగా నటించడం చాలా వినోదాత్మకంగా ఉంది. మధ్యలో నికొలా సెబాస్టియన్ పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో కథలో కామెడీ డోస్ మరింత పెరిగింది. ఇక ట్రైలర్ చివర్లో లావణ్య ఒక్కసారిగా అరుంధతి సినిమాలోని జేజమ్మలా మారిపోయి.. "నువ్వు నన్నేం చేయలేవురా?" అని భర్తతో చెప్పే డైలాగ్ థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయంగా కనిపిస్తోంది. చాలా కాలం తర్వాత లావణ్య త్రిపాఠి ఒక పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. భర్తను కిడ్నాప్ చేసే భార్యగా ఆమె నటన, దేవ్ మోహన్ తో ఆమె కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. సమ్మర్ కానుకగా మే 8న విడుదల కాబోతున్న ఈ ‘సతీ లీలావతి’ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


Next Story