ఆ ఆరు నెలలు నరకం చూశా.. పోస్ట్‌పార్టమ్ కష్టాలపై కియారా ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

మొదటి ఆరు నెలలు నాపై నాకు జాలి చూపించుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించేది నరకం చూశా.

ఆ ఆరు నెలలు నరకం చూశా.. పోస్ట్‌పార్టమ్ కష్టాలపై కియారా ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ నటి కియారా అద్వానీ, తల్లి అయిన తర్వాత తన జీవితంలో చోటు చేసుకున్న భావోద్వేగ మార్పుల గురించి మొదటిసారి మనసు విప్పి మాట్లాడారు. 2025 జూలైలో తన కుమార్తె సారాయకు జన్మనిచ్చిన తర్వాత, తను ఎదుర్కొన్న పోస్ట్‌పార్టమ్ (బిడ్డ పుట్టిన తర్వాత వచ్చే మానసిక స్థితి) దశ గురించి ఒక ఇంటర్వ్యూలో వివరిస్తూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. బిడ్డ పుట్టిన తర్వాత తన గుర్తింపు పూర్తిగా మారిపోయిందని కియారా తెలిపారు. "మొదటి ఆరు నెలలు నాపై నాకు జాలి చూపించుకోవడం కూడా చాలా కష్టంగా అనిపించేది నరకం చూశా. ఎప్పుడూ ఇతరుల గురించి ఆలోచించే నేను, మొదటిసారి నా కోసం నేను సమయం కేటాయించుకోవాలని గ్రహించాను. నాలోని భావాలను అర్థం చేసుకోవడానికి, నన్ను నేను ప్రేమించుకోవడానికి ఈ మాతృత్వం ఒక గొప్ప మలుపులా నిలిచింది" అని కియారా ఎమోషనల్ అయ్యారు.

తన కష్టకాలంలో భర్త సిద్ధార్థ్ మల్హోత్రా అందించిన మద్దతును కియారా కొనియాడారు. "ఆ రోజుల్లో నేను చాలా సున్నితంగా ఉండేదాన్ని, చిన్న చిన్న విషయాలకే ఏడ్చేసేదాన్ని. సిద్ధార్థ్ తన సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నా, అర్ధరాత్రి వేళ కూడా మా అమ్మ ఇంటికి వచ్చి నన్ను కలిసేవాడు. డాక్టర్ సలహా మేరకు నన్ను ప్రతిరోజూ రాత్రి పూట బయట డ్రైవ్‌కు తీసుకెళ్లేవాడు. ఆ చిన్న ప్రయాణం నాకు స్వచ్ఛమైన గాలిని, మానసిక ప్రశాంతతను ఇచ్చేది" అని ఆమె చెప్పుకొచ్చారు. కాగా.. 2023లో పెళ్లి చేసుకున్న ఈ జంట, గతేడాది పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం కియారా తన తదుపరి చిత్రం 'టాక్సిక్' విడుదలకు సిద్ధమవుతోంది. కన్నడలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో యష్, నయనతార వంటి స్టార్లతో కలిసి ఆమె నటిస్తోంది. మాతృత్వంలోని కష్టసుఖాలను దాటుకుని, మళ్లీ వెండితెరపై మెరవడానికి కియారా సిద్ధంగా ఉన్నారు. ఇందులో రుక్మిణి వసంత్, తారా సుతారియా కూడా కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

Next Story