ఇలాంటి దాడులు చూసి షాకయ్యా.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్‌లో రోజు రోజుకీ పెరుగుతున్న ఫేక్ రివ్యూస్ ముప్పుపై మరోసారి చర్చ మొదలైంది.

ఇలాంటి దాడులు చూసి షాకయ్యా.. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్‌లో రోజు రోజుకీ పెరుగుతున్న ఫేక్ రివ్యూస్ ముప్పుపై మరోసారి చర్చ మొదలైంది. సినిమా బాగున్నా సరే, విడుదలైన క్షణాల్లోనే కొన్ని వర్గాలు కావాలనే నెగెటివ్ ప్రచారం చేస్తూ థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లకుండా చేస్తున్నాయనే ఆరోపణలు ఇండస్ట్రీలో బలంగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా బుక్ మై షో లాంటి ప్లాట్‌ఫాంలలో ముందే నెగెటివ్ రేటింగ్స్ ఇవ్వడం సినిమాల రిజల్ట్‌పై తీవ్రంగా ప్రభావితం చేస్తోందన్న వాదన ఉంది. ఈ క్రమంలోనే ‘మన శంకరవరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)మూవీ టీమ్ కోర్టును ఆశ్రయించగా, విచారణ అనంతరం బుక్ మై షోలో నెగెటివ్ రివ్యూస్, రేటింగ్స్ ఆప్షన్‌ను తాత్కాలికంగా నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు ఇవ్వడం సంచలనంగా మారింది. ఈ తీర్పు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారగా, తాజాగా దీనిపై రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)స్పందిస్తూ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. “బుక్ మై షోలో ఈ మార్పు చూడడం ఒకవైపు సంతోషంగా ఉంది.. మరోవైపు చాలా బాధగా కూడా ఉంది” అంటూ తన ఎమోషనల్ అయ్యాడు విజయ్.

ఈ నిర్ణయం వల్ల ఎంతో మంది కలలు, కష్టం, పెట్టుబడులు కాపాడుకునే దారి కనిపించిందని చెప్పిన ఆయన, అదే సమయంలో మన సొంతవాళ్లే ఇలాంటి సమస్యలు సృష్టించడం బాధ కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. “బతకండి.. బతకనీయండి అనే నినాదం ఎక్కడికి వెళ్లింది? అందరూ కలిసి ఎదగాలనే ఆలోచన ఎందుకు మాయమైంది?” అంటూ ప్రశ్నించాడు. ఇంకా ‘డియర్ కామ్రేడ్’ సినిమా సమయంలో ఎదురైన అనుభవాలను గుర్తు చేసుకున్న విజయ్, వ్యవస్థీకృతంగా జరుగుతున్న దాడులు చూసి తాను షాక్ అయ్యానని చెప్పాడు. “ప్రతిసారి మాట్లాడినప్పుడు చెవిటివాడి ముందు శంఖం ఊదినట్టే అనిపించింది. మంచి సినిమాను ఎవ్వరూ ఆపలేరని నాకు చెప్పారు. కానీ ఎందుకు ఇలా చేస్తున్నారో అర్థం కాక ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను” అని అన్నాడు.

ఇన్నాళ్లకు ఈ సమస్యపై న్యాయస్థానం దృష్టి పడటంపై సంతోషం వ్యక్తం చేసిన విజయ్, చిరంజీవి లాంటి అగ్ర హీరో సినిమాకూ ఇదే ముప్పు ఉందని కోర్టు గుర్తించడం చాలా కీలకమని అన్నారు. ఇది పూర్తి పరిష్కారం కాకపోయినా, కనీసం కొంతవరకు అయినా మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. చివరగా ‘మన శంకరవరప్రసాద్ గారు’తో పాటు సంక్రాంతికి విడుదలవుతున్న అన్ని సినిమాలు ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నానని అన్నాడు. ఇక ఈ పోస్ట్‌తో పాటు కోర్టు తీర్పుకు సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను షేర్ చేయడంతో, విజయ్ దేవరకొండ మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

link

Next Story