యుద్ధం మధ్యలో చిక్కుకున్న హీరోయిన్.. దయచేసి నా కోసం ప్రార్థించండి అంటూ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

ఎమిరేట్స్ విమానంలో న్యూయార్క్ నుంచి ముంబైకి వస్తున్నాను. దుబాయ్‌లో ల్యాండ్ కావాల్సిన సమయంలో అక్కడ క్షిపణి దాడులు జరగడంతో యూఏఈ గగనతలాన్ని మూసివేశారు.

యుద్ధం మధ్యలో చిక్కుకున్న హీరోయిన్.. దయచేసి నా కోసం  ప్రార్థించండి అంటూ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమీషా పటేల్ తాజాగా ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నారు. న్యూయార్క్ నుంచి ముంబైకి ఎమిరేట్స్ విమానంలో ప్రయాణిస్తుండగా, మధ్యలో దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్ కావాల్సిన విమానం యుద్ధ పరిస్థితుల కారణంగా మస్కట్‌కు మళ్లించబడింది. యూఏఈ (UAE) పై జరిగిన క్షిపణి దాడుల నేపథ్యంలో గగనతలం మూసివేయడంతో ఆమె గంటల తరబడి విమానాశ్రయంలో చిక్కుకుపోయారు. ఈ ఆందోళనకర పరిస్థితులపై అమీషా పటేల్ తన ట్విట్టర్ ద్వాారా వరుస అప్‌డేట్స్ ఇచ్చారు. "ఎమిరేట్స్ విమానంలో న్యూయార్క్ నుంచి ముంబైకి వస్తున్నాను. దుబాయ్‌లో ల్యాండ్ కావాల్సిన సమయంలో అక్కడ క్షిపణి దాడులు జరగడంతో యూఏఈ గగనతలాన్ని మూసివేశారు. మా విమానాన్ని మస్కట్‌కు మళ్లించారు. ఈ యుద్ధాలు ఎప్పుడు ముగుస్తాయో.. దయచేసి అందరూ నా కోసం ప్రార్థించండి" అంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తర్వాత దుబాయ్ ఎయిర్‌పోర్ట్ లాంజ్‌లో తన టీమ్ సభ్యులతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేస్తూ.. 24 గంటలుగా విమానాశ్రయాల్లోనే గడుపుతున్నానని, ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్తానా అని ఎదురుచూస్తున్నట్లు తెలిపారు.

పశ్చిమ ఆసియాలో ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడంతో ఈ దాడులు ఇప్పుడు తీవ్రతరమయ్యాయి. హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడం, ప్రతిగా అమెరికా దళాలు ఇరాన్ ఓడరేవులను దిగ్బంధించడం వల్ల ప్రపంచ రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. ఈ యుద్ధ ప్రభావంతో సామాన్య ప్రయాణికుల విమానాలు రద్దవ్వడం లేదా దారి మళ్ళించడం జరుగుతోంది. దుబాయ్ వంటి బిజీ ఎయిర్‌పోర్ట్‌లు మూతపడటంతో వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం అమీషా పటేల్ క్షేమంగానే ఉన్నప్పటికీ, ఆమె ఎదుర్కొన్న ఈ అనుభవం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. సెలబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే సామాన్యుల పరిస్థితి ఏంటని నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story