మనుషుల కంటే అడవే నయం.. మాళవిక మోహనన్ సంచలన వ్యాఖ్యలు

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-04 05:55:29  IST  )

విరామం దొరికినప్పుడు అడవిలోకి వెళ్లడం నాకు ఒక ధ్యానం లాంటిది. అక్కడ మనుషులు ఉండరు, కేవలం నిశ్శబ్దం, ప్రశాంతత మాత్రమే ఉంటాయి.

మనుషుల కంటే అడవే నయం.. మాళవిక మోహనన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, సినిమా: సినిమా షూటింగ్‌లు, గ్లామర్ మెరుపులు, వందల మంది మనుషుల మధ్య బిజీగా గడిపే నటి మాళవిక మోహనన్(Malavika Mohanan) లో ఒక అద్భుతమైన వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్ దాగి ఉన్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె జంతువుల పట్ల తనకున్న ప్రేమను పంచుకున్నారు. జపాన్‌కు చెందిన ‘పంచ్’ అనే బేబీ కోతిని దాని తల్లి వదిలేసిన ఉదంతం తనను ఎంతగానో కదిలించిందని ఆమె పేర్కొన్నారు. వన్యప్రాణుల ఫోటోగ్రఫీ అంటే కేవలం కెమెరా పట్టుకుని వెళ్లడం కాదు, అది ఒక తపస్సు అని మాళవిక అన్నారు. ‘‘అడవిలోకి వెళ్లినప్పుడు మనం అక్కడ అతిథులం మాత్రమే, ఆక్రమణదారులం కాదు. జంతువుల దగ్గరకు వెళ్లేటప్పుడు మనకు ఏదో హక్కు ఉన్నట్లు ప్రవర్తించకూడదు.

వాటిని గౌరవించాలి. అడవి మనకు నేర్పే అతిపెద్ద పాఠం ఓపిక . ఒక్కోసారి 12 గంటలు వేచి చూసినా ఏ జంతువు కనిపించకపోవచ్చు, అంతా మన అదృష్టం మీద ఆధారపడి ఉంటుంది’’ అని ఆమె వివరించారు. 2019లో సరదాగా మొదలైన ఈ ఫోటోగ్రఫీ ప్రయాణం ఇప్పుడు ఆమెకు ఒక ప్యాషన్‌గా మారిందట. ‘‘సినిమా సెట్స్‌లో సగటున 300 నుండి 400 మంది మధ్య ఉంటాను. ఆ హడావిడి నుండి విరామం దొరికినప్పుడు అడవిలోకి వెళ్లడం నాకు ఒక ధ్యానం లాంటిది. అక్కడ మనుషులు ఉండరు, కేవలం నిశ్శబ్దం, ప్రశాంతత మాత్రమే ఉంటాయి. మనుషుల కంటే అడవే నయం అనిపిస్తుంది ’’ అని మాళవిక తన మనసులోని మాటను పంచుకున్నారు.

గత ఆగస్టులో ఆఫ్రికాలోని సెరెంగేటి నేషనల్ పార్క్‌లో జరిగిన ‘గ్రేట్ మైగ్రేషన్’ (జంతువుల వలస)ను చూడటం తన జీవితంలో ఒక మధుర జ్ఞాపకమని ఆమె చెప్పారు. అలాగే ఒక తల్లి చిరుత పులి తన పిల్లలతో కలిసి ఉన్న దృశ్యాన్ని కెమెరాలో బంధించడం తనను ఎంతో ప్రభావితం చేసిందని అన్నారు. రాజస్థాన్‌లోని రణతంబోర్, మహారాష్ట్రలోని తడోబా అడవుల్లో కూడా ఆమె పర్యటించారు. ముంబై వంటి రద్దీ నగరాల్లో నివసించే వారికి ప్రకృతితో సంబంధం ఉండటం చాలా అవసరమని మాళవిక అభిప్రాయపడ్డారు. ఇది మన మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని, ప్రకృతితో మమేకమైనప్పుడే మన జీవితంలో ఒక సమతుల్యత వస్తుందని చెప్పుకొచ్చారు.

Ayesha Khan: నా పీరియడ్స్ మీకు నేషనల్ జోక్ అయిపోయిందా.. వ్యూస్ కోసం ఎంతకైనా తెగిస్తారా?

Next Story