ప్రాణాలు పణంగా పెట్టి చేసినా కష్టాన్ని గుర్తించలేదు.. షూటింగ్ ప్రమాదంపై శర్వానంద్ ఎమోషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |

‘జాను’ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో భారీ ప్రమాదం జరిగింది.

ప్రాణాలు పణంగా పెట్టి చేసినా కష్టాన్ని గుర్తించలేదు.. షూటింగ్ ప్రమాదంపై శర్వానంద్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ చార్మింగ్ స్టార్ శర్వానంద్, తన కెరీర్‌లో ఎదురైన అత్యంత కష్టమైన , ఎమోషనల్ క్షణాల గురించి ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మనసు విప్పి మాట్లాడారు. ఆయన నటించిన ‘బైకర్’ సినిమా ఘనవిజయం సాధించిన నేపథ్యంలో, తన గత చేదు జ్ఞాపకాలను గుర్తు చేసుకుని ఆవేదన వ్యక్తం చేశారు. శర్వానంద్ మాట్లాడుతూ.. ‘జాను’ మూవీ షూటింగ్ సమయంలో తనకు జరిగిన ఘోర ప్రమాదం గురించి తెలిపారు. "ఆ సినిమా కోసం థాయ్‌లాండ్‌లో స్కైడైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో భారీ ప్రమాదం జరిగింది. నా భుజం ఎముక పూర్తిగా విరిగిపోయింది. అది ఎంత క్లిష్టమైన సర్జరీ అంటే, కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. కానీ ఆ సమయంలో ఆ ప్రమాదం గురించి పరిశ్రమలో గానీ, బయట గానీ ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు" అని శర్వానంద్ ఎమోషనల్ అయ్యారు.

ఒక నటుడిగా సినిమా కోసం ప్రాణాలకు తెగించి సాహసాలు చేసినప్పుడు, కనీసం సానుభూతి లేదా గుర్తింపు లభించకపోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఆయన అన్నారు. "ప్రాణాలకు తెగించి చేసిన సాహసానికి విలువ లేనప్పుడు, నేను ఇండస్ట్రీలో అంత తక్కువ వాడినా? అని నాకు అనిపించింది. నా కష్టానికి గుర్తింపు లేదా అని చాలా బాధపడ్డాను" అంటూ తన మనసులోని ఆవేదనను బయటపెట్టారు. సాధారణంగా పెద్ద హీరోలకు చిన్న దెబ్బ తగిలినా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది. కానీ తాను అంత పెద్ద సర్జరీ చేయించుకున్నా ఎవరూ స్పందించకపోవడం తనను మానసికంగా కుంగదీసిందని శర్వానంద్ తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ విషయంపై తెలుసుకున్న అభిమానులు శర్వానంద్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. కష్టానికి తగ్గ ఫలితం ఇకపై దక్కుతుంది అన్న అధైర్య పడకని అంటున్నారు.

Next Story