రాజమౌళిని చూసి పాన్ ఇండియా సినిమాలు తీయొద్దు.. మీ పరిధి ఏంటో తెలుసుకోండి.. మేకర్స్‌కు జగపతి బాబు వార్నింగ్

by Mallepaka Hamsa |

రాజమౌళి ఒక గొప్ప టెక్నీషియన్. ఆయన బాహుబలి తీశారు కదా అని, అందరూ బాహుబలి లాంటి సినిమాలే తీయాలనుకోవడం తప్పు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఇండస్ట్రీ తయారైంది.

రాజమౌళిని చూసి పాన్ ఇండియా సినిమాలు తీయొద్దు.. మీ పరిధి ఏంటో తెలుసుకోండి.. మేకర్స్‌కు జగపతి బాబు వార్నింగ్
X

దిశ, సినిమా: సీనియర్ నటుడు జగపతి బాబు ప్రస్తుతం విలన్, తండ్రి పాత్రలతో టాలీవుడ్‌లో సెకండ్ ఇన్నింగ్స్‌ను అద్భుతంగా కొనసాగిస్తున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా అలరించిన ఆయన, ఇప్పుడు వెండితెరపై తన నటనతో మెప్పిస్తూనే, బయట కూడా తన ముక్కుసూటితనంతో వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా చిత్ర పరిశ్రమలో జరుగుతున్న పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపుతున్నాయి. జగపతి బాబు మాట్లాడుతూ.. ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీ ఒకవైపు అభివృద్ధి చెందుతున్నప్పటికీ, మరోవైపు పడిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దర్శకుడు రాజమౌళిని ఉదాహరణగా తీసుకుని ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. "రాజమౌళి ఒక గొప్ప టెక్నీషియన్. ఆయన బాహుబలి తీశారు కదా అని, అందరూ బాహుబలి లాంటి సినిమాలే తీయాలనుకోవడం తప్పు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లుగా ఇండస్ట్రీ తయారైంది. వారు వెయ్యి కోట్లు పెట్టి సినిమా తీశారు కాబట్టి, మనం కూడా భారీగా ఖర్చు చేయాలనే ఆలోచన సరైనది కాదు" అని జగపతి బాబు కుండబద్దలు కొట్టారు.

సినిమా బడ్జెట్, మేకింగ్ విషయంలో వాస్తవికత ఉండాలని ఆయన సూచించారు. మన పరిధి ఎంత? మనం ఎంతవరకు ఖర్చు చేయగలం? అనే అవగాహన ఉండాలని, అలా కాకుండా కేవలం గొప్పలకు పోయి సినిమాలు తీస్తే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే ఈ మధ్య కాలంలో చాలామంది అసలు సెలబ్రిటీ హోదా రాకముందే, తాము పెద్ద స్టార్లమని ఊహించుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. ముఖ్యంగా పాన్ ఇండియా ట్రెండ్ గురించి జగపతి బాబు స్పందిస్తూ.. బాహుబలి సక్సెస్ తర్వాత ప్రతి ఒక్కరూ పాన్ ఇండియా అంటూ కేవలం డబ్బింగ్ చేసి వదిలేస్తున్నారని విమర్శించారు. పేరుకే పాన్ ఇండియా తప్ప, ఇతర భాషల్లో కనీసం ఓపెనింగ్స్ కూడా తెచ్చుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజమౌళి సాధించిన ఘనతను చూసి, అందరూ అలా చేయలేరని, అనుకరణ వల్ల చేతులు కాల్చుకుంటున్న వారిని ఉద్దేశించి ఆయన ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి జగపతి బాబు చేసిన ఈ వ్యాఖ్యలు చిత్ర పరిశ్రమలోని ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతున్నాయి.

Next Story