కండోమ్స్, సెక్స్ గురించి కొడుకుతో చర్చలు.. మాధవన్ పెంపకంపై సోషల్ మీడియాలో రచ్చ!

by Mallepaka Hamsa |

వేదాంత్‌కు కేవలం నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే తాను ప్రతి విషయాన్ని చాలా ఓపెన్‌గా మాట్లాడటం మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు.

కండోమ్స్, సెక్స్ గురించి కొడుకుతో చర్చలు.. మాధవన్ పెంపకంపై సోషల్ మీడియాలో రచ్చ!
X

దిశ, సినిమా: విలక్షణ నటుడు ఆర్. మాధవన్ కేవలం సినిమాలతోనే కాకుండా, తన ఆలోచనలతో కూడా ఎప్పుడూ అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుమారుడు వేదాంత్ పెంపకం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో పెద్ద చర్చకు దారితీశాయి. పిల్లలతో తల్లిదండ్రులు ఎంత స్వేచ్ఛగా ఉండాలో చెబుతూ మాధవన్ పంచుకున్న విషయాలు అందరినీ ఆలోచింపజేస్తున్నాయి. మాధవన్ తన కుమారుడిని ఎప్పుడూ ఒక పిల్లాడిలా చూడలేదని, ఒక బాధ్యత గల వ్యక్తిగానే పరిగణించానని చెప్పారు. వేదాంత్‌కు కేవలం నాలుగేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే తాను ప్రతి విషయాన్ని చాలా ఓపెన్‌గా మాట్లాడటం మొదలుపెట్టినట్లు ఆయన వెల్లడించారు. సమాజంలో చాలామంది మాట్లాడటానికి సంకోచించే సెక్స్ ఎడ్యుకేషన్, సురక్షితమైన పద్ధతులు, ఎదుటివారికి ఇవ్వాల్సిన గౌరవం వంటి సున్నితమైన అంశాలపై కూడా తండ్రీకొడుకులు చర్చించుకుంటారట.

పిల్లలతో ఇలాంటి విషయాలను దాచకుండా చెప్పడం వల్ల వారిలో బాధ్యత పెరుగుతుందని మాధవన్ నమ్ముతున్నారు. "నేను తనతో ఇంత ఓపెన్‌గా ఉండటం వల్ల వేదాంత్‌లో నాపై నమ్మకం పెరిగింది. మా నాన్న నన్ను ఒక వ్యక్తిగా గుర్తిస్తున్నారనే భావం తనలో కలిగింది. ఆ గౌరవమే తనను మరింత బాధ్యతాయుతమైన పౌరుడిగా మార్చడానికి సహాయపడింది" అని మాధవన్ వివరించారు. సరైన సమయంలో సరైన విషయాలు చెప్పకపోతే పిల్లలు దారి తప్పే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. సాధారణంగా మన సమాజంలో లైంగిక విద్య లేదా వ్యక్తిగత భద్రత గురించి మాట్లాడటానికి తల్లిదండ్రులు వెనకాడుతుంటారు. కానీ మాధవన్ మాత్రం పిల్లలు పెద్దయ్యే వరకు వేచి చూడకుండా, చిన్నప్పటి నుంచే వారికి అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. తండ్రిగా ఆయన అనుసరిస్తున్న ఈ పద్ధతిని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ప్రస్తుతం మాధవన్ కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.

Next Story