‘మాతృభూమి’ విడుదలకు సెన్సార్ బోర్డ్ బ్రేక్..!

by Mallepaka Hamsa |

ఆగస్టులో రిలీజ్ అవుతుందని అందరూ భావించినప్పటికీ, ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పడినట్లు సమాచారం.

‘మాతృభూమి’ విడుదలకు సెన్సార్ బోర్డ్ బ్రేక్..!
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, చిత్రాంగద సింగ్ జంటగా నటించిన సినిమా ‘మాతృభూమి’. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ 16 బీహార్ రెజిమెంట్ కమాండర్ ఆఫీసర్ అయిన కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపించబోతున్నారు. అపూర్వ లఖియా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను సల్మాన్ ఖాన్ ఫిల్మ్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇందులో అభిలాష్ చౌదరి, అంకర్ భాటియా కీలక పాత్రలో నటించారు. హిమేష్ రెషమ్మియా సంగీతం అందించారు. ఈ చిత్రం 2020లో గాల్వాన్ లోయలో భారత చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణ ఆధారంగా తెరకెక్కించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 17న విడుదల కావాల్సి ఉండగా, పలు కారణాల వల్ల వాయిదా పడింది. ఆగస్టులో రిలీజ్ అవుతుందని అందరూ భావించినప్పటికీ, ఇప్పుడు మరోసారి సినిమా వాయిదా పడినట్లు సమాచారం.

సెన్సార్ బోర్డ్ (CBFC) ఈ సినిమాకు క్లియరెన్స్ ఇవ్వడానికి నిరాకరించడమే దీనికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ఈ సినిమా చైనా సరిహద్దు ఘర్షణల నేపథ్యంలో ఉండటంతో, విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడం వల్లే సెన్సార్ బోర్డ్ దీనిని నిలిపివేసిందనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా ఈ వివాదంపై భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో తమకు ఎలాంటి ప్రమేయం లేదని ఆయన స్పష్టం చేశారు. భారతదేశంలో మూవీ నిర్మాణానికి, విడుదలకు సంబంధించిన విషయాలను పూర్తిస్థాయిలో సెన్సార్ బోర్డ్ అధికారులు చూసుకుంటారని, ఇందులో విదేశాంగ మంత్రిత్వ శాఖకు ఎలాంటి పాత్ర ఉండదని రణధీర్ జైస్వాల్ తెలిపారు. సినిమాలో గాల్వాన్ ఘర్షణలను చిత్రీకరించిన తీరుపై తాము అభ్యంతరం చెప్పామనే విషయంలో నిజం లేదని అన్నారు.

Next Story