ప్రియాంక చోప్రా ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం..

by Mallepaka Hamsa |

ఈ ఏడాది మే 9, 2026న లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ‘గోల్డ్ గాలా’ వేడుకల్లో ప్రియాంక చోప్రాకు ‘గ్లోబల్ వాన్‌గార్డ్ ఆనర్’ (Global Vanguard Honor) పురస్కారాన్ని అందజేయనున్నారు.

ప్రియాంక చోప్రా ఖాతాలో మరో ప్రతిష్టాత్మక పురస్కారం..
X

దిశ, సినిమా: అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమా సత్తాను చాటుతున్న నటి ప్రియాంక చోప్రా మరో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, సామాజిక కార్యకర్తగా కూడా తనదైన ముద్ర వేస్తున్న ప్రియాంకకు, ఆసియా పసిఫిక్ ప్రాంతానికి చెందిన ప్రముఖులను సత్కరించే ప్రతిష్టాత్మక సంస్థ ‘గోల్డ్ హౌస్’ నుంచి ప్రత్యేక ఆహ్వానం అందింది.ప్రతి ఏటా వివిధ రంగాల్లో రాణిస్తున్న అత్యున్నత ఆసియా ప్రముఖులతో ‘గోల్డ్ హౌస్’ సంస్థ ‘గోల్డ్ 100’ జాబితాను విడుదల చేస్తుంది. ఈ ఏడాది మే 9, 2026న లాస్ ఏంజిల్స్‌లో జరగబోయే ‘గోల్డ్ గాలా’ వేడుకల్లో ప్రియాంక చోప్రాకు ‘గ్లోబల్ వాన్‌గార్డ్ ఆనర్’ (Global Vanguard Honor) పురస్కారాన్ని అందజేయనున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆసియా సంస్కృతిని ప్రతిబింబించడంలో ఆమె పోషిస్తున్న పాత్రను, వినోద రంగంలో ఆమె సాధించిన అద్భుత విజయాలను గుర్తిస్తూ ఈ గౌరవాన్ని ప్రకటించారు. ‘ఏ న్యూ గోల్డ్ వరల్డ్’ అనే థీమ్‌తో ఈ వేడుకలు ఎంతో వైభవంగా జరగనున్నాయి. ప్రియాంక చోప్రా కెరీర్ విషయానికొస్తే, ప్రస్తుతం ఆమె భారతీయ చిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ ప్రాజెక్టులో నటిస్తున్నారు. దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘వారణాసి’ చిత్రంలో ప్రియాంక హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ సినిమాతో ఆమె టాలీవుడ్ ఇండస్ట్రీకి ఘనంగా పరిచయం కాబోతున్నారు. ఇందులో మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. గ్లోబల్ స్థాయిలో అవార్డులు అందుకుంటూనే, మరోవైపు రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడితో తెలుగు తెరపైకి వస్తుండటంతో ప్రియాంక ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రయాణించిన ఈ ‘దేశీ గర్ల్’, ఇప్పుడు టాలీవుడ్‌లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో అని నెట్టింట చర్చించుకుంటున్నారు.

Next Story