గుండెలు పిండేసే ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ భూమి పెడ్నేకర్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-03 06:21:24  IST  )

ఇది అత్యంత విషాదకరం, గుండెలు పిండేసే ఘటన. దీనికి ఎవరూ బాధ్యత వహించరా? బాధులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి.

గుండెలు పిండేసే ఘటన.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ భూమి పెడ్నేకర్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ సమీపంలో బార్గి డ్యామ్ వద్ద జరిగిన ఘోర పడవ ప్రమాదం దేశవ్యాప్తంగా పెను విషాదాన్ని నింపింది. ఇక ఈ ఘటనపై సినీ సెలబ్రిటీలతో పాటు రాజకీయ నాయకులు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తున్నారు. తాజాగా, ఈ హృదయ విదారక ఘటనపై బాలీవుడ్ నటి భూమి పెడ్నేకర్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేవలం విచారం వ్యక్తం చేయడమే కాకుండా, ఇలాంటి ప్రమాదాలకు బాధ్యతాయుతమైన వారు జవాబుదారీతనం వహించాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. ఈ ప్రమాదంలో రెస్క్యూ టీమ్‌ను సైతం కన్నీరు పెట్టించిన ఒక దృశ్యం గురించి భూమి ప్రత్యేకంగా ప్రస్తావించారు. బోల్తా పడిన పడవ నుంచి మృతదేహాలను వెలికితీస్తున్న సమయంలో, ఒక తల్లి తన బిడ్డను గుండెలకు హత్తుకుని విగతజీవిగా కనిపించింది. ప్రాణం పోయే క్షణంలో కూడా బిడ్డను కాపాడుకోవాలనే ఆ తల్లి తాపత్రయం అందరినీ కలచివేసింది. "ఇది అత్యంత విషాదకరం, గుండెలు పిండేసే ఘటన. దీనికి ఎవరూ బాధ్యత వహించరా? బాధులపై కచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ తల్లి తన కుమారుడిని గట్టిగా పట్టుకున్న దృశ్యం నా కళ్ల ముందే మెదులుతోంది. అది నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది.ఆ కుటుంబాలకు నా ప్రార్థనలు తోడుంటాయి" అని భూమి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రాసుకొచ్చారు.

ఈ ప్రమాదం వెనుక అధికారుల, పడవ సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. పడవలో సామర్థ్యానికి మించి ప్రయాణికులను ఎక్కించారని (దాదాపు 45 మంది), ప్రయాణం మొదలవడానికి ముందు ఎవరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రమాదం జరగడానికి ముందు గాలివాన వస్తుంటే.. చుట్టుపక్కల ఊరి జనాలు కేకలు వేసి పడవను ఆపమని చెప్పినా, పైలట్ పట్టించుకోకుండా అలాగే ముందుకు వెళ్లడం వల్లే ఈ ఘోరం జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. లైఫ్ జాకెట్లు పంచే లోపే పడవ నీటిలో మునిగిపోయింది. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఇప్పటికే ముగ్గురు సిబ్బందిని ఉద్యోగం నుంచి తొలగించడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ఇటువంటి క్రూయిజ్ పడవలపై నిషేధం విధించారు. మృతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా కూడా ప్రకటించారు. అయితే, ప్రభుత్వం ఎన్ని ఆర్థిక సాయాలు ప్రకటించినా, అధికారుల నిర్లక్ష్యం వల్ల పోయిన ప్రాణాలు తిరిగి రావని భూమి పెడ్నేకర్ తన పోస్ట్‌లో గుర్తు చేశారు. ఇంత జరిగినా బాధ్యతాయుతమైన వారు జవాబుదారితనం వహించాలని భూమి డిమాండ్ చేస్తోంది.

అల్లు అర్జున్ ‘రాకా’ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో.. యాక్షన్ సిక్వెన్స్‌తో బాక్సాఫీసు షేక్ అవడం ఖాయం!

Next Story