నితిన్-అనుదీప్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారైనా అదృష్టం కలిసొస్తుందా?

by Mallepaka Hamsa |

'జాతిరత్నాలు' సినిమాతో అందరినీ నవ్వించిన డైరెక్టర్ అనుదీప్ కేవీతో నితిన్ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

నితిన్-అనుదీప్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్.. ఈసారైనా అదృష్టం కలిసొస్తుందా?
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ కెరీర్ ప్రస్తుతం కాస్త ఒడిదుడుకుల్లో ఉంది. వరుసగా సినిమాలు చేస్తున్నా, బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందక ఆయన సతమతమవుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. 'జాతిరత్నాలు' సినిమాతో అందరినీ నవ్వించిన డైరెక్టర్ అనుదీప్ కేవీతో నితిన్ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నితిన్ నటించిన 'ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్', 'రాబిన్ హుడ్, తమ్ముడు' వంటి గత చిత్రాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అటు దర్శకుడు అనుదీప్ పరిస్థితి కూడా అలాగే ఉంది. 'జాతిరత్నాలు' తర్వాత ఆయన చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు.

దీంతో ఇప్పుడు వీరిద్దరూ కలిసి ఎలాగైనా ఒక సాలిడ్ హిట్ కొట్టాలని కంకణం కట్టుకున్నారట. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పట్టాలెక్కించబోతోందని సమాచారం. అనుదీప్ సినిమాల్లో కామెడీ బాగుంటుంది కానీ, కథలో బలం ఉండదనే విమర్శ ఉంది. అందుకే ఈసారి ఆ తప్పు జరగకుండా, కేవలం కామెడీ బిట్ల మీద మాత్రమే ఆధారపడకుండా ఒక పక్కా కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. నితిన్ బాడీ లాంగ్వేజ్‌కు సరిపోయే వినోదంతో పాటు, మంచి ఎమోషన్ కూడా ఈ సినిమాలో ఉండబోతోందట. ఈ కొత్త ప్రయత్నం నితిన్‌ను మళ్లీ విజయాల బాట పట్టిస్తుందని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. అయితే, వరుస ఫ్లాపుల్లో ఉన్న ఈ హీరో, డైరెక్టర్ జోడీకి ఈసారైనా అదృష్టం కలిసి వస్తుందా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. సరైన హిట్ పడితే నితిన్ క్రేజ్ మళ్ళీ పెరగడం ఖాయం.

Next Story