జగన్ పాలనపై సినీనటుడు అలీ ప్రశంసల వర్షం

by  |
ali
X

దిశ, ఏపీ బ్యూరో : జగన్ కేబినెట్‌లో మంత్రి పదవి వస్తుందంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై సినీనటుడు అలీ స్పందించారు. మంత్రి పదవి వస్తే అంతకంటే ఏముంటుందన్నారు. మంత్రి పదవి వస్తే మంచిదే కదా అని అలీ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో ఎస్సీ,ఎస్టీ, బీసీ మైనారిటీల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరైన అలీ.. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనపై అలీ ప్రశంసల వర్షం కురిపించాడు.

తనకు జన్మనిచ్చిన రాజమండ్రిలో ఉండగానే కేఎల్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌ ప్రకటించడం ఆనందంగా ఉందన్నారు. వైసీపీ పాలన అద్భుతంగా ఉందని కొనియాడారు. రాష్ట్రంలో అన్ని వర్గాలకు వైఎస్‌ జగన్‌ సమన్యాయం చేస్తున్నారంటూ కొనియాడారు. మరోవైపు సినీ పరిశ్రమకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలు లేవని చెప్పుకొచ్చారు. ఆన్‌లైన్‌ టికెట్ల విధానం, బెనిఫిట్ షో వివాదానికి త్వరలోనే పరిష్కారం లభిస్తుందని అలీ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు తాను 5 భాషల్లో 1124 సినిమాల్లో నటించినట్లు అలీ వెల్లడించారు.

ఈ సందర్భంగా కేఎల్ యూ గౌరవ డాక్టరేట్ ప్రక్రటించడం చాలా సంతోషాన్ని కలిగించిందని చెప్పుకొచ్చారు. ఇకపోతే అలీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. 2019 ఎన్నికల ప్రచారంలో కూడా అలీ పాల్గొన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడంతో అలీకి మంచి పదవి వస్తుందని అంతా భావించారు. అయితే ఇప్పటి వరకు సీఎం జగన్ అలీకి ఎలాంటి పదవులు ఇవ్వకపోవడంతో ఆయన అభిమానులు కాస్త నిరుత్సాహంలో ఉన్నారు. ఇకపోతే ఈ ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనారిటీల ఆత్మీయ సమ్మేళనంలో రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్, శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజు, రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్‌తోపాటు ఇతర ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


Next Story

Most Viewed