భారత జట్టులో ఆ బౌలర్లు చాలా ప్రత్యేకం

63

దిశ, స్పోర్ట్స్ : భారత జట్టులో స్థానం సంపాదించిన అనేక మంది స్పిన్నర్లలో ఎక్కువగా గుజరాత్ వాళ్లే ఉంటారు. ఆ తర్వాత కర్ణాటక, తమిళనాడుకు చెందిన స్పిన్నర్లు ఎక్కువగా టీమ్ ఇండియా తరఫున ఆడారు. కానీ ఇక్కడ ఒక విశేషం ఏమిటంటే.. గుజరాత్ నుంచి వచ్చిన స్పిన్నర్లు అందరూ ఎడమ చేతి వాటం బౌలర్లే కావడం. బీసీసీఐ రికార్డులు గమనిస్తే గుజరాత్, సౌరాష్ట్ర స్పిన్నర్లు, సీమర్లు ఎక్కువగా ఎడమ చేతి వాటం బౌలర్లే ఉంటారు. ఇది ఇప్పటికీ అనేక మందిని ఆశ్చర్యపరిచే విషయం. ఒకనాటి వినూ మన్కడ్ నుంచి నేటి అక్షర్ పటేల్ వరకు దాదాపు 8 మంది స్పిన్నర్లు భారత జాతీయ జట్టుకు ఆడారు. వాళ్లందరూ ఎడమ చేతి వాటం బౌలర్లే కావడం విశేషం.

ఎడమ చేతి వాటానికి గుజరాత్ పుట్టినిల్లు..

క్రికెటర్లను పక్కన పెడితే దేశంలో అత్యధిక ఎడమ చేసి వాటం జనాభా గుజరాత్‌లోనే ఉంటుంది. అక్కడి వాతావరణమో, డీఎన్ఏనో కాని అత్యధికంగా ఎడమ చేతి వాటం ప్రజలు గుజరాత్, సౌరాష్ట్ర ప్రాంతాల్లో ఉంటారు. అందుకే అక్కడి క్రికెటర్లు కూడా లెఫ్ట్ హ్యాండ్ అయి ఉంటారు. భారత జట్టు ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గుజరాత్‌లోని జామ్ నగర్‌కు చెందిన వ్యక్తి. లెఫ్టాండ్ బ్యాటింగ్ , బౌలింగ్ చేస్తూ టీమ్ ఇండియాలో కీలకంగా ఎదిగాడు. ఐసీసీ ఆల్‌రౌండర్ల జాబితాలో మెరుగైన ర్యాంకులో ఉన్నాడు. ఆస్ట్రేలియాలో అతడు గాయపడటంతో జడేజా స్థానంలో అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చాయి. యాదృశ్చికంగా అక్షర్ గుజరాత్ వాడే కావడం.. అందులో ఎడమ చేతి వాటం బౌలర్ అవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

గుజరాత్ నుంచి జాతీయ జట్టులోకి వచ్చి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన లెజెండరీ క్రికెటర్ వినూ మన్కడ్ కూడా ఎడమ చేతి వాటం క్రికెటర్. ఇలా గుజరాత్ నుంచి ఇప్పటి వరకు 8 మంది లెఫ్టార్మ్ స్పిన్నర్లు జాతీయజట్టుకు ప్రాతినిథ్యం వహించారు. వీరందరూ కలసి టెస్టుల్లో 637 వికెట్లు తీశారు. టీమ్ ఇండియా విజయాల్లో వీరు కీలక పాత్ర పోషించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఇక్కడి ఫాస్ట్ బౌలర్లు కూడా లెఫ్టార్మర్లే కావడం గమనార్హం. జయదేవ్ ఉనద్కత్, చేతన్ సకారియా ఎడమ చేత్తోనే బౌలింగ్ వేస్తారు. సౌరాష్ట్ర రంజీ జట్టులో కనీసం ఒకరైనా లెఫ్టార్మ్ పాస్ట్ బౌలర్ ఉంటుంటారు.

కానీ కర్ణాటకదే హవా..

గుజరాత్ నుంచి ఎక్కువ మంది లెఫ్టార్మ్ స్పిన్నర్లు వస్తున్నారు. వారందరూ కలసి ఇప్పటికి 600పైగా వికెట్లు తీశారు. కానీ కర్ణాటక స్పిన్నర్లదే ఇప్పటి వరకు ఆధిపత్యం. లెగ్ స్పిన్నర్లు బీఎస్ చంద్రశేఖర్, అనిల్ కుంబ్లే కలసి టెస్టుల్లో 861 వికెట్లు తీశారు. గుజరాత్ నుంచి 8 మంది స్పిన్నర్లు ఉన్నా.. వీరిద్దరే వారిపై ఆధిపత్యం చెలాయించడం విశేషం. వీరితో పాటు తమిళనాడుకు చెందిన రవిచంద్రన్ అశ్విన్, పంజాబ్‌కు చెందిన హర్బజన్ సింగ్ కుడి చేతి వాటం అయినా సరే మంచి స్పిన్నర్లుగా రాణించారు. ‘గుజరాత్ నుంచి రానున్న రోజుల్లో మరింత మంది లెఫ్టార్మర్లు వస్తారని. అహ్మదాబాద్‌లో ఏర్పాటు చేయబోయే స్పోర్ట్స్ కాంప్లెక్స్ ద్వారా మెరుగైన క్రికెటర్లు తయారవుతారని’ మాజీ స్పిన్నర్ దిలీప్ జోషి అంటున్నారు. గుజరాత్‌కు చెందిన దిలీప్ జోషి జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించారు. ఆయన కూడా ఎడమ చేతి వాటం స్పిన్నర్ కావడం గమనార్హం.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..