మహిళలు టెక్ విద్యలో మరింత వేగంగా రాణించాలి: ఫల్గుణి నాయర్

by  |
Falguni Nayar
X

దిశ, వెబ్‌డెస్క్: ఎక్కువమంది మహిళలు ఇంటర్నెట్, టెక్నాలజీ వనరులను అందిపుచ్చుకోవాలని నైకా సీఈఓ ఫల్గుణి నాయర్ అన్నారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) విద్యను నేర్చుకోవడం ద్వారా వ్యాపారంలో రాణించవచ్చని ఆమె అభిప్రాయపడ్డారు. శుక్రవారం ప్రారంభమైన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) సమావేశంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ సంస్థ సీఈఓ స్థానాలతో పాటు టాప్ మేనేజ్‌మెంట్, వ్యాపార విజయాల్లో విజయవంతమైన భారతీయుల ఉదాహరణలు మనకు ఉన్నాయి.

ఇదే సమయంలో మహిళలకు సమాన అవకాశాలున్నాయి. ఇంకా దీనికోసం మరింత మెరుగైన సహకారం మహిళలకు లభించాల్సి ఉంది. మహిళలు కలలను, కెరీర్‌ను కొనసాగించేందుకు అవకాశాలు కావాలని ఆమె అన్నారు. స్టెమ్ విద్యను ఎంచుకునే మహిళల సంఖ్య అధికంగా ఉన్నప్పటికీ వారి సంఖ్య ఇంకా పెరగాల్సిన అవసరం ఉంది. స్మార్ట్‌ఫోన్‌లు, ఇంటర్నెట్, టెక్నాలజీలపై మరింత పట్టు సాధించాలన్నారు.

ఫల్గుణి నాయర్ 2012లో నైకా సంస్థను స్థాపించి బ్యూటీ ఉత్పత్తుల విభాగంలో విజయవంతంగా కొనసాగుతున్నారు. ఇటీవలే ఈ సంస్థ స్టాక్ మార్కెట్లలో ప్రవేశించి అద్భుతమైన ఆరంగేట్రం సాధించింది. భారత్ ఎంతో పురోగతి సాధించింది. మహిళలకు మరింత స్వేచ్ఛగా కలలుగనే హక్కుని, వాటిని నిజం చేసుకునే అవకాశాన్ని కల్పించాలని ఫల్గుణి నాయర్ తెలిపారు.

Next Story

Most Viewed