పీసీసీ రేసుపై క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు

by Aamani |
congress leader duddilla sridhar babu
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర పీసీసీ రేసుపై క్లారిటీ ఇచ్చారు కాంగ్రెస్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్​బాబు. పీసీసీ రేసులో నేను లేనంటూ స్పష్టం చేశారు. పీసీసీపై ఏఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకున్న అంగీకారమేనని, అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్​ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని, పార్టీ పగ్గాలు ఎవరికి అప్పగించినా అందరం కలిసి పని చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముప్పై వేల ఎకరాల భూమిని అమ్మాలని చూస్తోందని, ప్రభుత్వం ఇచ్చిన జీవో 13 ను వెంటనే వెనక్కి తీసుకోవాలని శ్రీధర్​బాబు డిమాండ్​ చేశారు. ఆస్తులను కాపాడుకునేందుకు సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిందని, మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రం రూ. 4 లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిందని ఆరోపించారు.

ఉమ్మడి రాష్ట్రంలో భూములు అమ్మకోలేదా అని మంత్రి హరీశ్​రావు అంటున్నారని, ఆనాడు ఆస్తులు అమ్ముతుంటే వద్దని ఆనాటి ముఖ్యమంత్రికి చెప్పామని, ఈ విషయం టీఆర్‌ఎస్​నాయకులకు కూడా తెలుసన్నారు. జిల్లాలో భూముల్ని అన్యాక్రాంతం కాకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపైన ఉందని, భూములను కాపాడాల్సిన ప్రభుత్వం అమ్మకానికి పెట్టిందని శ్రీధర్​బాబు ఆరోపించారు. ఆరున్నరేండ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న అనేక పనులన్నీ ప్రజావ్యతిరేకంగానే ఉన్నాయని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమ్మే భూములు ఎవరికి.. ఏ ప్రాంతానికి చెందిన వారికి అమ్ముతారని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా తెలంగానేతరులకు భూములు అమ్మే ప్రయత్నం జరుగుతుందని, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో వేల ఎకరాలు పేదలకు పంచామని, పొడు భూములు కూడా పంపిణీ చేశామని ఈ సందర్భంగా గుర్తు చేశారు.

కరోనా కాలంలో ఆర్థిక కష్టాలను చూపిస్తూ తెలంగాణ రాష్ట్రంలోని విలువైన భూములను ప్రజలు గద్దెనెక్కించిన తెలంగాణ రాష్ట్ర సమితి అమ్మే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు రాష్ట్రం నుంచి టీఆర్‌ఎస్​ను ఏ విధంగా వెల్లగొట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారంటూ శ్రీధర్​బాబు దుయ్యబట్టారు. గత ప్రభుత్వాలు కూడా ఇలాగే భూములన్నీ అమ్మితే ఈ రోజు భూములు ఉండేవా అని ప్రశ్నించారు. పార్టీలన్నీ కలిసి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని శ్రీధర్​బాబు పిలుపునిచ్చారు.

Advertisement

Next Story