ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు మళ్లీ కరోనా పరీక్షలు

18

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. హైదరాబాద్ నగరంలోనే కాకుండా గ్రామాల్లోనూ విపరీతంగా పెరుగుతూ ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. దీని కారణంగా ఇటీవల మొదలైన అసెంబ్లీ సమావేశాలకు మంత్రులు, ఎమ్మెల్యేలకు కరోనా పరీక్షలు నిర్వహించి, నెగిటివ్ రిపోర్టు వచ్చిన వారినే సభలోకి అనుమతిచ్చారు. కాగా అసెంబ్లీ సమావేశాలు సోమవారానికి వాయిదా పడటంతో రాష్ట్రంలోని ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు మరోసారి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

సోమవారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోగా పరీక్షలు చేయించుకొని సిద్ధంగా ఉండాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ్యులకు ఆదేశాలు జారీ చేశారు. అంతేగాకుండా సమావేశాలకు వచ్చే అధికారులు కూడా ఆదివారం సాయంత్రం పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అందరి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని పోచారం స్పస్టం చేశారు.