ఎమ్మెల్యేల కోసం కోట్ల ఖర్చుతో భవనాలు.. ‘విందు, మందు’ పార్టీలకు వేదికలు.?

by Aamani |
ఎమ్మెల్యేల కోసం కోట్ల ఖర్చుతో భవనాలు.. ‘విందు, మందు’ పార్టీలకు వేదికలు.?
X

దిశ ప్రతినిధి, ఆదిలాబాద్ : ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండేందుకు రూ. కోట్లు వెచ్చించి నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు నిరుపయోగంగా మారాయి. కొన్ని చోట్ల ఇంకా నిర్మాణాలు పూర్తికాకపోగా.. పూరైన చోట ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండటం లేదు. కొందరు ఎమ్మెల్యేలు నెలల తరబడి ముఖం చూడకపోగా.. మరికొందరు వారానికి రెండు రోజులు చుట్టపు చూపుగా వచ్చిపోతున్నారు. మిగతా సమయాల్లో నియోజకవర్గానికి వస్తే ఇంటి వద్ద.. లేదంటే హైదరాబాద్‌లో ఉంటున్నారు. దీంతో ప్రజలు తమ సమస్యలు, గోడు వెళ్లబోసుకునేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితి ఏర్పడింది.

నియోజకవర్గ ప్రజల సమస్యలు, బాధలను స్థానిక ఎమ్మెల్యేలకు తెలుపుకునేందుకు ఒక వేదిక అవసరమని భావించిన రాష్ట్ర ప్రభుత్వం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను నిర్మించింది. ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో నిర్మాణాలు చేపట్టగా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పది నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని నిర్మించింది. ఇప్పటికే చాలా చోట్ల నిర్మాణాలు పూరై.. ప్రారంభోత్సవాలు కూడా చేశారు. కొన్ని చోట్ల నిర్మాణం పూర్తికాక.. అసంపూర్తిగా ఉన్నాయి. ఎమ్మెల్యేలు ఈ క్యాంపు కార్యాలయాల్లోనే నివాసం ఉండాల్సి ఉండగా.. మెజారిటీ ఎమ్మెల్యేలు అసలు వాటి వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. రూ. కోట్లు వెచ్చించి నిర్మాణించిన భవనాలు అలంకార ప్రాయంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో ఉన్నన్ని రోజులు ఇక్కడే ఉండి.. ప్రజల సమస్యలు, బాధలు తెలుసుకోవాలి. అలాంటిది మెజారిటీ ఎమ్మెల్యేలు అటువైపు కన్నెత్తి చూడకపోవటంతో.. ఈ భవనాలు పార్టీ నాయకులు, కార్యకర్తలకు గెస్ట్ హౌజుల్లా మారిపోయాయి. విందు, వినోదాలు, మందు పార్టీలకు వేదికలుగా మారుతున్నాయి.

రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి క్యాంపు ఆఫీసులో ఉండటం లేదు. తన సొంత నివాసంలో ఉండగా.. కనీసం నెలకోసారి కూడా ఆ భవానానికి వెళ్లటం లేదు. కరోనా సమయంలో నిత్యవసరాల పంపిణీ కార్యక్రమం రెండు, మూడు సార్లు అక్కడే చేపట్టారు. ఏదో ఉందా అంటే ఉందన్నట్లుగా క్యాంపు కార్యాలయం దర్శనమిస్తోంది. చెన్నూర్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ స్థానికంగా ఉండరు. హైదరాబాదులో నివాసం ఉండగా.. నెలకు ఒకసారి వచ్చి పోతున్నారు. అభివృద్ధి పనులు, సీఎంఆర్ఎఫ్, కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ చెక్కుల కార్యక్రమాలకు మాత్రమే వస్తున్నారు. ఆయన వస్తేనే క్యాంపు ఆఫీస్‌కు నాయకులు, కార్యకర్తలు వస్తుండగా.. మిగతా సమయాల్లో తాళం వేసి ఉంటోంది. ఆయన వచ్చినప్పుడే మాత్రమే ప్రజలు కలిసేందుకు అవకాశం ఉంటోంది.

MLA-Camp-Office1
బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు ఆదిలాబాద్‌లో నివాసం ఉండగా.. బోథ్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌కు ప్రతీ మంగళవారం వచ్చి 2 రోజులు ఉంటారు. కరోనా వల్ల రాలేకపోతున్నారు. ఎమ్మెల్యే వచ్చినప్పుడే క్యాంపు కార్యాలయం తెరుస్తుండగా.. మిగతా రోజులు అసలు తాళమే తీయటం లేదు. దీంతో నియోజకవర్గ ప్రజలు ఆదిలాబాద్ వెళ్లి కలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు.. క్యాంపు కార్యాలయంలో ఎప్పుడు ఉంటున్నారో.. ఎప్పుడు ఉండరో తెలియటం లేదు. కరోనా సమయంలో అసలు క్యాంపు కార్యాలయం తెరవలేదు. క్యాంపు కార్యాలయంలో ఆయన మొక్కుబడిగా ఉండటంతో.. ప్రజలకు ఇబ్బందిగా మారింది. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మంచిర్యాలలో నివాసం ఉండగా.. కార్యక్రమాలు ఉన్నప్పుడే క్యాంపు ఆఫీసుకు వస్తున్నారు. మిగతా సమయాల్లో మూసి ఉంటోంది. ముధోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి దేగాంలోని తన నివాసంలో ఉండగా.. నిత్యం ప్రజలు అక్కడికే వెళ్తున్నారు. ముధోల్ క్యాంపు ఆఫీసుకు పెద్దగా జనం వెళ్లరు. ఆయన కూడా అప్పుడప్పుడే క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్నారు.

ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఎక్కువగా క్యాంపు కార్యాలయంలోనే ఉండగా.. నిరంతరం అందుబాటులో ఉంటున్నారు. అన్ని రకాల సమీక్షలు, సమావేశాలు అక్కడే నిర్వహిస్తున్నారు. సిర్పూర్(టి) ఎమ్మెల్యే కోనేరు కోనప్ప స్థానికంగా ఉన్నప్పుడు నిత్యం రెండు, మూడు గంటలు అక్కడ అందుబాటులో ఉంటున్నారు. ఆయన లేకుంటే ఆయన సోదరుడు జడ్పీ వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, నాయకులు, కార్యకర్తలు అందుబాటులో ఉంటున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే అజ్మీరా రేఖా నాయక్ క్యాంపు కార్యాలయంలోనే నివాసం ఉంటున్నారు. మంచిర్యాలలో ఇంకా క్యాంపు కార్యాలయం నిర్మాణ పనులు పూర్తి కాలేదు. ఇంకా ప్రారంభోత్సవం చేయలేదు.

Advertisement

Next Story