చిన్నారుల్లో మిస్ -సి సిండ్రోమ్

by  |
చిన్నారుల్లో మిస్ -సి సిండ్రోమ్
X

దిశ, ఫీచర్స్ : కొవిడ్ ఫస్ట్ వేవ్‌లో యువతకు పెద్దగా నష్టంచేయని మహమ్మారి, సెకండ్ వేవ్‌లో మాత్రం చాలా మందిని బలితీసుకుంటోంది. ఇక థర్ట్ వేవ్‌ పిల్లలకు ప్రమాదకరంగా ఉండబోతుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో కరోనా వైరస్ దాడి నుంచి కోలుకున్న రోగులలో మరొక వ్యాధి వ్యాప్తి‌చెందుతూ.. ఎక్కువగా పిల్లలను అటాక్ చేస్తుండటం కలవరపెట్టే అంశం. దీన్ని మల్టీ-సిస్టమ్ ఇన్‌ఫ్లే‌మేటరీ సిండ్రోమ్ (MIS-C) వ్యవహరిస్తుండగా, ప్రస్తుతం ఈ వ్యాధితో 177 మంది జాతీయ రాజధానిలో చికిత్స అందుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు MIS-C అంటే ఏమిటి? తల్లిదండ్రులు దాని గురించి ఎందుకు తెలుసుకోవాలి?

MIS-C నే.. పిమ్స్(పిఐఎమ్‌ఎస్- పీడియాట్రిక్ మల్టీ-సిస్టమ్ ఇన్‌ఫ్లేమేటరీ సిండ్రోమ్)గానూ పిలుస్తారు. ఇది పిల్లలలో కొత్తగా గుర్తించిన తీవ్రమైన అనారోగ్యం. ఇది COVID-19 కి సంబంధించినది. చాలా మంది పిల్లలకు, ఇది కరోనావైరస్ ఇన్‌ఫెక్షన్ డిలేయడ్ కాంప్లికేషన్‌(ఆలస్య సమస్య)గా కనిపిస్తుంది, అయినప్పటికీ MIS-C- సంబంధిత లక్షణాలతో ఉన్న పిల్లలందరూ పాజిటివ్ వచ్చినవాళ్లే లేరు. అయితే దీన్ని ప్రారంభంలో గుర్తించకపోతే తీవ్రమైన సమస్యలతో పాటు మరణానికి దారితీసే అవకాశాలున్నాయని వైద్యనిపుణులు చెబుతున్నారు. MIS-C తో బాధపడుతున్న పిల్లలలో మరణాల రేటు వందలో ఒకరుగా ఉంది. కొవిడ్ -19‌ను సంక్రమించే మొత్తం పిల్లల సంఖ్యతో పోల్చినట్లయితే MIS-C చాలా అరుదు. అలా అని నిర్లక్ష్యం చేయకూడదు. ప్రస్తుత పరిస్థితుల్లో గణాంకాలకంటే పిల్లల భద్రతే ముఖ్యం.

MIS-C బారిన పడుతున్న చాలా మంది పిల్లలు COVID కలిగి ఉన్నారు లేదా COVID ఉన్నవారి చుట్టూ ఉన్నారు. ముఖ్యంగా MIS-C రావడానికి నాలుగు వారాల ముందు కోవిడ్ వచ్చి ఉండొచ్చు. కానీ అది ఎసింప్టమాటిక్ కావచ్చంటున్నారు వైద్యులు. ఈ MIS-C మెదడు, గుండె, రక్త నాళాలు, ఉదరం, మూత్రపిండాలు వంటి బహుళ అవయవాలలో మంటను కలిగిస్తుంది. దీని వల్ల జ్వరం రావొచ్చు లేదా గుండె రక్త నాళాలను ప్రభావితం చేసే (ఫలితంగా గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంది) అవకాశం ఉంది. విపరీతమైన సందర్భంలో బహుళ అవయవాలు విఫలం కావచ్చు. 24 నుండి 72 గంటల కంటే ఎక్కువసేపు జ్వరం (100.4 డిగ్రీల ఫారెన్‌హీట్ లేదా 38 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన) ఉంటే తల్లిదండ్రులు వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. శరీరంపై దద్దుర్లు, మెడ నొప్పి లేదా వాపు, కళ్లు ఎర్రబడటం, ఎర్రటి నాలుక, కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, అలసట, బద్ధకం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి లేదా ఒత్తిడి, మూర్ఛ లేదా బూడిద/ నీలం రంగులో పెదాలు వంటి లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా పిల్లలను వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లడం చాలా ముఖ్యం.

తల్లిదండ్రులు COVID, MIS-C గురించి అవగాహన కలిగి ఉండాలని, అన్ని COVID జాగ్రత్తలను శ్రద్ధగా పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. మల్టీ-సిస్టమ్ ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్ సంక్రమించే పిల్లల వయస్సు 6 నెలల నుండి 15 సంవత్సరాల వరకు ఉంటుంది. అయితే, గరిష్ట కేసులు 5 – 15 సంవత్సరాల మధ్య నమోదవుతున్నాయి. ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఇంటెన్సివ్ కేర్ చాప్టర్ గణాంకాల ప్రకారం, COVID-19 మొదటి వేవ్ సమయంలో దేశంలో 2 వేలకు పైగా MIS-C కేసులు నమోదయ్యాయి. ఈ సిండ్రోమ్‌ను ముందుగానే నిర్ధారిస్తే నయం చేయవచ్చని నిపుణులు అంటున్నారు.


Next Story