పిచ్చెక్కిస్తున్న మీర్జాపూర్ 2 క్రేజ్.. నటీనటుల భారీ కటౌట్‌లు

by  |
పిచ్చెక్కిస్తున్న మీర్జాపూర్ 2 క్రేజ్.. నటీనటుల భారీ కటౌట్‌లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఒకప్పుడు అభిమాన హీరో సినిమా విడుదలైన రోజున థియేటర్ ముందు పెద్ద కటౌట్ పెట్టి, దానికి పూల దండలు వేయడంతో పాటు పాలాభిషేకం చేసేవారు. ఇప్పుడు అలాంటి సీన్‌లు కనిపించడం చాలా అరుదు. పూల దండలు, పాలాభిషేకాలు పక్కన పెడితే కనీసం కటౌట్‌ను పట్టించుకునే దిక్కు కూడా లేదు. అలాంటిది ఇప్పుడు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రధాన నగరాల్లో పెద్ద పెద్ద కటౌట్‌లు రాత్రికి రాత్రే ప్రత్యక్షం అయ్యాయి. అసలు థియేటర్‌లే నడవని సమయాల్లో కటౌట్‌లు ఎందుకని ఆశ్చర్యపోకండి. కటౌట్‌లు పెట్టింది సినిమా కోసం కాదు వెబ్‌సిరీస్ కోసం. అక్టోబర్ 23న అమెజాన్ ప్రైమ్‌లో విడుదలకానున్న మీర్జాపూర్ 2 సిరీస్‌కు ఉన్న క్రేజ్ వల్ల ఇప్పుడు కటౌట్‌ల కాలం తిరిగివచ్చేందుకు అవకాశం వచ్చింది. రౌడీ మాఫియా ఇతివృత్తంగా తెరకెక్కిన ఈ సిరీస్‌లో మొదటి సీజన్ విడుదలై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. మొదటి సీజన్‌లో జరిగిన అన్యాయానికి హీరో ఎలా పగతీర్చుకుంటాడని, చివరికి మీర్జాపూర్ సింహాసనం ఎవరి వశం కానుందని ఈ రెండో సీజన్‌లో చూపించనున్నారు.

అయితే మొదటి సీజన్ పూర్తయ్యాక రెండో సీజన్ ఎప్పుడు వస్తుందని అభిమానులు ఆత్రుతగా ఎదురు చూశారు. ఇన్నాళ్లకు సీజన్ 2 విడుదలకాబోతుండటంతో చాలా ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. ఈ ఎగ్జయిట్‌మెంట్ మరింతగా క్యాష్ చేసుకోవడానికి అమెజాన్ ప్రైమ్ ఈ కటౌట్‌ల ప్రచారం మొదలుపెట్టింది. ఉత్తర ప్రదేశ్‌లోని బెనారస్, ఆగ్రా, ఘాజియాబాద్, బరైలీ, ప్రయాగ్‌రాజ్, మీరట్, లక్నో, కాన్పూర్ నగరాల్లో సిరీస్‌లో ప్రధాన పాత్రధారులైన కాళీన్ భయ్యా (పంకజ్ త్రిపాఠి), గుడ్డూ పండిట్ (అలీ ఫజల్), మున్నా భయ్యా (దివ్యేందు శర్మ)లు కలిసి ఉన్న కటౌట్‌లను నిలబెట్టింది. ఈ కటౌట్‌ల కింద క్యూఆర్ కోడ్ ఉంచింది. ఈ కోడ్‌ను స్కాన్ చేయడం ద్వారా మీర్జాపూర్ సింహాసనాన్ని ఎవరు అధిష్టించబోతున్నారనే ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగే పోలింగ్ కూడా పెట్టారు. ఇంకో విషయం ఏంటంటే.. అమెజాన్ ప్రైమ్‌లో మీర్జాపూర్ మొదటి సీజన్ తెలుగు ఆడియోతో, తెలుగు సబ్‌టైటిల్స్‌తో కూడా ఉంది. అంతేకాకుండా మీర్జాపూర్ 2 కూడా తెలుగు ఆడియోతో విడుదలకాబోతోంది. ఎంతైనా హిందీ వాళ్లు తెలుగు బూతులు మాట్లాడుతుంటే వచ్చే మజానే వేరు, అందుకేనేమో ఈ సిరీస్‌కు ఇంత క్రేజ్!



Next Story

Most Viewed