ఒక్కడి కోసం స్టేటంతా అక్కడే..

by  |
Nomula Bhagat
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: అది నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నిక. బరిలో 60 మంది అభ్యర్థులు. అందులో ఆయా పార్టీల అభ్యర్థులు కొంతమందే. అధికశాతం అభ్యర్థులంతా ఇండిపెండెంట్లే. ప్రధాన పోటీ అధికార టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్యే. అయితేనేం అధికార టీఆర్ఎస్ పార్టీ అపోజిట్ అభ్యర్థులపై ఏకంగా యుద్ధమే ప్రకటించినట్టుగా సిద్ధమయ్యింది. గల్లీ మొదలుకుని.. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల వరకు అంతా పార్టీ ఎన్నికల ఇన్‌ఛార్జుల కనుసన్నల్లోనే జరుగుతోంది. టీఆర్ఎస్ ప్రచార ప్రక్రియలో 12 మంది ఎమ్మెల్యేలు.. మరో ముగ్గురు మంత్రులతో నాగార్జునసాగర్ నియోజకవర్గాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు. ఓవైపు ఎమ్మెల్యేలు.. మరోవైపు మంత్రులు.. అభ్యర్థులను మించిన స్థాయిలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో పోటీ చేసిన టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ ఒక్కడి కోసం ఇంతమంది ప్రత్యర్థులపై విరుచుకుపడుతుండడం సాగర్ ఓటర్లకు కొత్తదనంగా కన్పిస్తోందనడంలో ఏలాంటి సందేహం లేదు.

మండలానికో ఎమ్మెల్యే.. ఆపై మంత్రులు..

నాగార్జునసాగర్ ఉపఎన్నికకు అధికార టీఆర్ఎస్ పార్టీ మాములుగా సిద్ధం కాలేదు. ఓటర్లను అడుగడుగునా జల్లెడ పడుతూ తమవైపునకు తిప్పుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఫలితాల అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని అందివచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అందులో భాగంగానే సాగర్ నియోజకవర్గంలోని ప్రతి మండలంతో పాటు మున్సిపాలిటీకి సైతం ఇన్‌ఛార్జులుగా నియమించింది. తిరుమలగిరి(సాగర్) మండలానికి దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, హాలియా పట్టణానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, పెద్దవూర మండలానికి చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్, గుర్రంపోడుకు నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, నిడమనూరుకు మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు, త్రిపురారం మండలానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, అనుముల మండలానికి కాగజ్ నగర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నందికొండ మున్సిపాలిటీకి కరీంనగర్ మేయర్ సునీల్‌రావులు ఎన్నికల ఇన్‌ఛార్జులుగా కొనసాగుతున్నారు.

కాలికి బలం కట్టుకున్న మంత్రులు..

అధికార టీఆర్ఎస్ పార్టీ సాగర్ ఉపఎన్నికలో ఏ మంత్రిని ఏ సమయంలో ఏ ప్రాంతంలో వినియోగించాలి.?, ఏయే వర్గాలను కలవాలి..?, ప్రత్యర్థులను సెల్ఫ్ డిఫెన్స్ చేసుకునేందుకు ఏ వ్యుహాన్ని అమలు చేయాలనే అంశాలపై పూర్తిస్థాయి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే సాగర్ నియోజకవర్గంలో పర్యటిస్తోన్న మంత్రులు ఆ దిశగా ముందుకెళ్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ ముగిసిన దగ్గరి నుంచి హోంమంత్రి మహమూద్ అలీ, జగదీష్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌లు కాలికి బలపం కట్టుకున్నట్టుగా నియోజకవర్గాన్ని అణువణువునా సృశిస్తున్నారు. ప్రత్యేక సమావేశాలు, రోడ్డు షో, పదునైన వ్యాఖ్యలతో ఓటర్లను తమవైపునకు తిప్పుకుంటున్నారు. వాస్తవానికి ఒక్క అభ్యర్థిని గెలిపించడం కోసం ఇంతస్థాయిలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలను మోహరించడం సాగర్ నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఒక్కడిని గెలిపించడం కోసం ఈ స్థాయిలో నేతల రాకను గతంలో ఎప్పుడూ ఊహించకపోవడంతో ఓటర్లు సైతం ఔరా అని ముక్కున వేలేసుకుంటుండడం గమనార్హం.


Next Story

Most Viewed