తెలంగాణ రైతులపై కేంద్రం భారీ కుట్ర.. కుండబద్దలు కొట్టిన మంత్రి వేముల

by  |
Minister Vemula Prashanth Reddy
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్: తెలంగాణ రైతులు పండించిన ప్రతీ ధాన్యం గింజనూ కేంద్రం కొనాలని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. వరిధాన్యం కొంటామని కేంద్రం నుంచి బండి సంజయ్ ఆర్డర్ కాపీ తీసుకొస్తే, స్వయంగా టీఆర్ఎస్ నేతలే దగ్గరుండి వరి వేయిస్తామని సవాల్ విసిరారు. ఒకవేళ ఆర్డర్ కాపీ తీసురాకపోతే గ్రామాల్లో తిరగనివ్వబోమని హెచ్చరించారు. శుక్రవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కేంద్రం వరిధాన్యం కొనాలని టీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొ్న్న మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేస్తోన్న రాజకీయాల వల్ల రైతులు ఒత్తిడికి గురవుతున్నారని అన్నారు. కేంద్రం రాజకీయాల వల్ల రైతులు నలిగిపోవాలా?, రైతులంటే అంత చులకనా?, రైతుల కష్టాల్ని చూసి కేసీఆర్ కోరుకుంటాడా? అని ప్రశ్నించారు. దేశంలో ఎక్కడా లేనటువంటి రైతు సంక్షేమ పథకాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని, రైతులను పూర్తిగా మోసం చేసేది కేంద్రమే అని అన్నారు. కేంద్రమంత్రి ఒకమాట, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఒకమాట మాట్లాడితే ఎలా అని ఎద్దేవా చేశారు.

కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసే కుట్రలో భాగంగానే బీజేపీ ఇలా ప్రవర్తిస్తోందని, వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టి, మోటార్లకు మీటర్లు పెట్టే కుట్ర జరుగుతోందని అన్నారు. దీనిని బీజేపీ పార్టీలో ఉన్న రైతులు ఆలోచించి, బీజేపీ నుంచి బయటకు వచ్చి పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులను నిలువునా ముంచుతోందని రాజ్యసభ సభ్యులు సురేష్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ ఢిల్లీలో కేంద్రమంత్రిని కలిసినా.. ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. బండి సంజయ్ విమర్శల్లో వాస్తవం లేదని, బీజేపీ కపటనాటకాన్ని ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. అనంతరం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ.. రాష్ట్ర రైతాంగాన్ని బీజేపీ అధ్యక్షుడు తప్పుదోవ పట్టిస్తున్నాడని అన్నారు. జిల్లా ఎంపీ ధర్మపురి అర్వింద్ సైతం జిల్లాకు చేసిందేమీ లేదని విమర్శించారు.


Next Story

Most Viewed