శుభవార్త చెప్పిన మంత్రి.. సొంత స్థలమున్నోళ్లందరికీ ఫ్రీగా ఇళ్లు!

by  |

దిశ, బాల్కొండ: గత ప్రభుత్వాల హయాంలో పేదల ఇండ్లు కాగితాల మీద మాత్రమే కనబడి, లీడర్లు, కాంట్రాక్టర్ల జేబుల్లోకి పైసలు చేరేవని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌‌ రెడ్డి అన్నారు. బుదవారం వేల్పూర్ మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన 112 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ వేల్పూర్ లో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాలకోసం రూ. 7 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్‌‌ కు ధన్యవాదాలు తెలిపారు. నిజమైన అర్హులకు ఎలాంటి రాజకీయాలకు అవకాశం ఇవ్వకుండా ఇండ్లు మంజూరు చేశామన్నారు. మంచిపనులు జరిగేటప్పుడు చెడగొట్టేవారు చాలామంది ఉంటారని, వారి మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. గత ప్రభుత్వాలు పేదలకు ఇండ్లు ఇచ్చి ఉంటే ఈరోజు ఇలాంటి పరిస్థితి ఉండేదికాదని, కేవలం ఆ ఇండ్లు కాగితాలకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు.

రాబోయే రోజుల్లో సొంత స్థలం ఉన్నవారందరికీ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ఎవరూ ఆందోళన చెందవద్దని అన్నారు. ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇలాంటి ఇండ్లను పేదవారి కోసం కట్టించలేకపోయారన్నారు. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ప్రభుత్వాన్ని ఇంకా విమర్శంచేవారిని ఏమనలో ప్రజలే ఆలోచించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్ధానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.

Next Story