కేసీఆరే ఊపిరి పోశాడు.. మంత్రి తలసాని ఆసక్తికర వ్యాఖ్యలు

by  |
Minister Talasani Srinivas Yadav
X

దిశ, హుస్నాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యరంగానికి ఊపిరి పోశాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సిద్దిపేట జిల్లా తోటపల్లి ప్రాజెక్టులో ఆయన సోమవారం చేప పిల్లలు వదిలారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో తలసాని పాల్గొని మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో కులవృత్తులు చేసుకోలేని పరిస్థతి ఉండేదని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక అద్భుతంగా కుల వృత్తులు చేసుకొని జీవిస్తున్నారని తెలిపారు.

మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచడానికి ప్రభుత్వం సమీకృత మత్స్యఅభివృద్ధి పథకాన్ని 2014లో ప్రవేశపెట్టిందని అన్నారు. అందులో భాగంగానే ప్రతీ ఏడాది రూ.115 కోట్లతో 93 కోట్ల చేప పిల్లలను, 25 కోట్ల రొయ్య పిల్లలను జల, వనరుల్లో ఉచితంగా విడుదల చేస్తోందని వెల్లడించారు. నాడు గుక్కెడు మంచి నీళ్ళ కోసం గోస పడ్డ ప్రాంతాలే నేడు పచ్చని పంట పొలాలుగా మారి కళకళలాడుతున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా సాగుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.

అనంతరం ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మాట్లాడుతూ… తెలంగాణ రాకముందు తోటపల్లి పెద్ద చెరువులో చుక్క నీరులేక వెలవెలబోయిందన్నారు. నేడు తోటపల్లి జలాశయం 365 రోజులు జలకళను సంతరించుకుంటోందని తెలిపారు. చెరువులు, కుంటలు నిండితే సబ్బండ వర్గాల ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని అన్నారు. అనంతరం తోటపల్లి ప్రాజెక్టులో రూ.20 లక్షల విలువైన రెండు మొబైల్ ఫిష్ ఔట్ లెట్ సంచార వాహనాలను మంత్రి ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, ఆర్డీవో జయచంద్రారెడ్డి, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed