ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు: ఈసీ ఆదేశాలపై చిదంబరం ఫైర్

by samatah |
ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం ప్రతిపక్షాల హక్కు: ఈసీ ఆదేశాలపై చిదంబరం ఫైర్
X

దిశ, నేషనల్ బ్యూరో: అగ్నిపథ్ స్కీమ్‌ను రాజకీయం చేయొద్దని ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి ఆదేశాలు జారీ చేయడంపై ఆ పార్టీ సీనియర్ నేత చిదంబరం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విధానాన్ని విమర్శించడం ప్రతిపక్ష పార్టీల హక్కు అని నొక్కి చెప్పారు. ఈసీ సూచన తప్పు అని అన్నారు. ‘అగ్నిపథ్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పథకం. దానిలో అనేక లోపాలున్నాయి. కాబట్టి ప్రభుత్వ విధానాలను ఎండగట్టడం ప్రతిపక్షాల హక్కు’ అని తెలిపారు. అధికారంలోకి వస్తే ఈ స్కీమ్‌ను ఖచ్చితంగా రద్దు చేస్తామని తెలిపారు.

‘అగ్నివీర్ స్కీమ్‌తో యువకులకు నాలుగేళ్లుగా ఉపాధి కల్పించి, అనంతరం ఉద్యోగం ఇవ్వకుండా, పింఛన్ లేకుండా బయటికి పంపిస్తారు’ ఇది తప్పుకాదా అని ప్రశ్నించారు. ఈ పథకాన్ని సైన్యం వ్యతిరేకించినప్పటికీ ప్రభుత్వం బలవంతంగా తీసుకొచ్చిందని విమర్శించారు. అందుకే ఈ పథకాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీకి దిశా నిర్దేశం చేయడంలో ఈసీ సరైన విధంగా సూచనలు చేయలేదని తెలిపారు. కాగా, కులం, వర్గం, భాష మతపరమైన మార్గాల్లో ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం బుధవారం అధికార బీజేపీ, కాంగ్రెస్ లను ఆదేశించింది. అలాగే రక్షణ దళాలను రాజకీయం చేయొద్దని కాంగ్రెస్‌కు సూచించింది. ఈ క్రమంలోనే చిదంబరం పై వ్యాఖ్యలు చేశారు.

Next Story