మాంసం దుకాణాలపై నిరంతర తనిఖీలు

by  |
మాంసం దుకాణాలపై నిరంతర తనిఖీలు
X

– లైసెన్స్ లేకుంటే కఠిన చర్యలు
– పశుసంవర్థక శాఖ సమీక్షలో మంత్రి తలసాని

దిశ, హైదరాబాద్ : అనుమతులు లేకుండా, నిబంధనల ప్రకారం నిర్వహించని మాంసం దుకాణాల నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ దుకాణాలపై నిరంతరం తనిఖీలు చేపట్టాలని పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ కార్యదర్శి అనిత రాజేంద్ర, డైరెక్టర్ లక్ష్మారెడ్డి, అడిషనల్ డైరెక్టర్ రాంచందర్, జీహెచ్ఎంసీ చీఫ్ వెటర్నరీ ఆఫీసర్ అబ్దుల్ వకీల్ ఇతర అధికారులతో కలిసి మాసబ్ ట్యాంక్‌లోని పశు సంవర్థక శాఖ డైరెక్టర్ కార్యాలయంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో మంత్రి తలసాని మాట్లాడుతూ.. నగరంలో అనుమతులు లేకుండానే అనేక మాంసం దుకాణాలు కొనసాగుతున్నాయని, వెంటనే వాటిపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలన్నారు. దుకాణాదారులు లైసెన్స్ తీసుకునేలా చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.

దుకాణాల్లో పరిశుభ్రత పాటించడంతో పాటు ధరలను తెలిపేలా ప్రతి షాప్ వద్ద బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఇటీవల నగరంలోని 101 షాపుల్లో తనిఖీలు నిర్వహిస్తే 73 షాపులు లైసెన్స్ లేకుండానే నిర్వహిస్తున్నట్టు తెలిసిందని, అధికారుల పర్యవేక్షణ లోపంతోనే షాపుల నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా చూడాలన్నారు. గ్రేటర్ పరిధిలో ఎన్ని మాంసం దుకాణాలున్నాయి. లైసెన్స్ లేని దుకాణాలెన్ని? స్లాటర్ హౌస్‌లు ఎన్ని? తదితర వివరాలను సమగ్రంగా అందించాలని ఆదేశించారు. అక్రమంగా స్లాటర్ హౌస్ నిర్వహిస్తున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో మాంసాన్ని అధిక ధరలకు విక్రయిస్తున్నారంటూ వచ్చిన సమాచారంపై అధికారులు నిర్వహించిన తనిఖీలు సత్ఫలితాలు ఇచ్చాయని తెలిపారు. ఈ తనిఖీలతో మన రాష్ట్రం నుంచే కాకుండా, ఇతర దేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి ప్రశంసలు వచ్చాయన్నారు.

మాంసం ధరలు పెరగటానికి కారణమైన మధ్య దళారుల ప్రమేయాన్ని నివారించాలని సూచించారు. అందుకు పశు సంవర్థక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సమన్వయంతో ఒక నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా తనిఖీల సమయంలో గుర్తించిన అంశాలను అధికారులు మంత్రికి వివరించారు. కొన్ని షాపుల నిర్వాహకులు శానిటైజర్లు, మాస్క్‌లు ఉపయోగించడం లేదని, మరికొందరు రోడ్ల పక్కనే మాంసం విక్రయిస్తున్నారని మంత్రి దృష్టికి తెచ్చారు. తనిఖీల కోసం నియమించబడిన అధికారుల బృందం పలు సూచనలతో కూడిని నివేదికను ఈ సందర్భంగా మంత్రికి అందించింది.

Tags : Meat shops, Inspection, Talasani, Minister, Animal Husbendary Dept


Next Story

Most Viewed