షీ టీమ్ కేంద్రాలుగా అంగన్వాడీలు : మంత్రి

by  |
Satyavathi Rathod
X

దిశ, క్రైమ్ బ్యూరో: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాలను మహిళా రక్షణా కేంద్రాలుగా (షీ టీమ్స్) తయారు కావాలని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. హైదరాబాద్‌లోని ఎంహెచ్ఆర్డీలో సఖీ కేంద్రాల రాష్ట్రస్థాయి సమావేశం శనివారం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హాజరై మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా మహిళల పట్ల జరుగుతున్న దాడుల నివారణ, మహిళలకు రక్షణ తదితర సమస్యల పరిష్కారానికి పోలీసు, న్యాయ, వైద్యశాఖ, మహిళాభివృద్ది శిశు సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఈ క్రమంలో గ్రామాల్లోని అంగన్వాడీ కేంద్రాలు షీ టీమ్స్ లాగా తయారు కావాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.

మహిళల సమస్యల పరిష్కారంతో పాటు మహిళలకు రక్షణ కల్పించే కేంద్రాలుగా సఖీ కేంద్రాలను తీర్చిదిద్దాలన్నారు. బాధిత మహిళలకు అండగా నిలవాలన్నారు. శిశు సంక్షేమ శాఖ కమిషనర్ దివ్య మాట్లాడుతూ… రాష్ట్ర వ్యాప్తంగా గృహ హింస కేసులు తగ్గించాలన్నారు. దాడులకు గురవుతున్న వారికి పునరావాసం కల్పించడం, ఉపాధి చూపుతూ బాధితులకు అండగా ఉండాలన్నారు.

ఉమెన్ ప్రొటెక్షన్ విభాగం డీఐజీ సుమతి మాట్లాడుతూ.. ప్రజల్లో పోక్సో కేసులపై అవగాహన కల్పించాలన్నారు. పురుషులకు గృహ హింసపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ప్రతినెలా 220 నుంచి 240 వరకూ పోక్సో కేసులు నమోదు అవుతున్నాయని, పోలీస్ శాఖ డయల్ 100కి 1,51,000 కేసులు వస్తే 52 వేలు మహిళలపై దాడులు, హింసకు సంబంధించినవే ఉంటున్నాయని అన్నారు. ఈ కేసులు తగ్గాలంటే, మహిళలు షరతుల జీవనం నుంచి బయట పడేయాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రతి సఖీ కేంద్రానికి ఒక హోంగార్డును కేటాయిస్తామని అన్నారు.

Next Story

Most Viewed