భైంసా అల్లర్లపై అసెంబ్లీలో చర్చిస్తాం: ఇంద్రకరణ్ రెడ్డి

by  |
భైంసా అల్లర్లపై అసెంబ్లీలో చర్చిస్తాం: ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, ముధోల్: తరచూ జరిగే అల్లర్లలో నష్టపోయేది పేదలని, ఇప్పటికైనా ఇరు వర్గాలు సంయమనం పాటించి అభివృద్ధి బాటలో నడవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. భైంసా పట్టణంలోని విశ్రాంత భవనంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఘటన చాలా దురదృష్టకరమని, కొన్ని రాజకీయ పార్టీలు ఇదే అదునుగా భావించి టీఆర్ఎస్‌ను నిందించడం మంచిది కాదన్నారు. భారతదేశంలో ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా పాకిస్థాన్ పేరు వాడి యుద్ధవాతావరణానికి తెరలేపుతున్నారని మండిపడ్డారు.

భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రత్యేక బెటాలియాన్, ఓఎస్డీని నియమించాలని సీఎం, హోం మంత్రులను కోరినట్లు చెప్పారు. మహాగాం గ్రామంలో పర్యటించి బాధితులను పరామర్శించినట్లు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆటో తగలబెట్టడం బాధాకరమని, ఎంతో సామరస్యంగా ఉండే ఊళ్లలో కూడా ఇలా జరగడం దురదృష్టకరమన్నారు. ఈ అల్లర్లలో ఎక్కువగా నష్టపోయేది పేదలని.. శాశ్వత పరిష్కారానికి ఈ విషయాన్ని అసెంబ్లీలో చర్చిస్తామన్నారు. కొన్ని రాజకీయ పార్టీలు ఇదే అదునుగా భావించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారని చెప్పారు. అల్లర్లకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు.


Next Story

Most Viewed