స్ట్రగుల్‌ షూటర్‌గా మారిన ట్రబుల్ షూటర్.. కొంపముంచిన సొంత క్యాడర్

by  |
స్ట్రగుల్‌ షూటర్‌గా మారిన ట్రబుల్ షూటర్.. కొంపముంచిన సొంత క్యాడర్
X

దిశ, మెదక్: హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ ఓటమికి హరీశ్ నమ్ముకున్న క్యాడరే కారణమా అంటే దాదాపు అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల ఇన్‌చార్జీగా వ్యవహరించిన హరీశ్ రావు.. దుబ్బాక తరహా వ్యూహాన్నే హుజూరాబాద్‌లో అమలు చేయడంతో ఈ సారి కూడా సక్సెస్ కాలేకపోయారనే విమర్శలు గుప్పుమంటున్నాయి. అక్కడి ఓటర్లను ప్రసన్నం చేసుకోవడంలో సిద్దిపేట నేతలు విఫలమయ్యారు. వీరికి అక్కడి ప్రాంత టీఆర్ఎస్ నాయకులు కూడా సహకరించడం లేదని తెలుస్తోంది. నమ్మకున్న క్యాడరే హరీశ్‌ను నట్టేట ముంచారంటూ సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా జోరుగా చర్చ సాగుతోంది. దీనిపై టీఆర్ఎస్ నాయకులు మౌనంగా ఉండటం అందుకు బలాన్ని చేకూరుస్తుంది.

విఫలమైన సిద్దిపేట క్యాడర్..

సీఎం కేసీఆర్‌కి ఏ కష్టమొచ్చిన ఆ బాధ్యతలను హరీశ్ రావుకు అప్పగిస్తుంటారు. బాధ్యతలు స్వీకరించిన ట్రబుల్ షూటర్ ఎక్కడికి వెళ్లిన సిద్దిపేట నేతలనే నమ్ముకుంటారు. తన వెంట తీసుకెళ్ళి ప్రచార బాధ్యతలు అప్పగిస్తారు. గతంలో దుబ్బాకలోనూ అదే పనిచేసి విఫలమయ్యారు. ఆ ఓటమిని చూసిన తర్వాత కూడా మంత్రి తన వ్యూహాన్ని మార్చుకోలేదు. మళ్లీ అదే వ్యూహం అమలు చేశారు. అక్కడ సైతం మంత్రి వ్యూహాం బెడిసికొట్టింది. సిద్దిపేట నేతలు ప్రచారం పేరిట ఒకట్రెండు ఫొటోలు దిగి సోషల్ మీడియాలో వైరల్ చేసుకున్నారే తప్పా ఇంటింటికెళ్లి ప్రచారం చేయలేదని తెలుస్తోంది. పైగా ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఏర్పాటు చేసిన విందుల్లోనూ అక్కడి ప్రాంత ఓటర్లను పిలవకుండా వారే ఎంజాయ్ చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ ఓటమికి మొదటి కారణం ఇదేనంటూ సిద్దిపేట జిల్లా నాయకులు గుసగుసలాడుకుంటున్నారు.

సహకరించని హుజూరాబాద్ నేతలు..!

సిద్దిపేట నేతలకు హుజూరాబాద్ టీఆర్ఎస్ నేతలు సహకరించలేదని తెలుస్తోంది. మా ప్రాంతంలో మీరు అధికారం చెలాయించడమెందంటూ ఒకింత ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దుబ్బాక ఉప ఎన్నికలోనూ అదే విధంగా అక్కడి ప్రాంత నాయకులు మంత్రిపై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హుజూరాబాద్‌లోనూ అదే విధంగా వ్యవహరించడంతో హుజూరాబాద్ నేతలు సిద్దిపేట నేతలకు సహకరించలేదు. పైగా ఈ ప్రాంతం మీద సిద్దిపేట నేతలకు ఎటువంటి సమాచారం లేకపోగా.. ప్రచార విషయంలో సైతం సరైన అవగాహన లేకపోవడంతో టీఆర్ఎస్ తన సొంత ఓట్లను కోల్పోయినట్టు సమాచారం. మొత్తానికి టీఆర్ఎస్ నాయకుల సమన్వయ లోపంతో సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిందనే అంచనాకు టీఆర్ఎస్ నేతలు వచ్చారు. ఏదేమైనా మంత్రి హరీశ్ రావు వ్యూహం బెడిసికొట్టడంతో.. ట్రబుల్ షూటర్ కాస్త.. స్ట్రగుల్ షూటర్‌గా మారారంటూ హుజూరాబాద్, సిద్దిపేట నేతలు మంత్రిపై సెటైర్లు వేస్తున్నారు.

యువకుడికి సాయంత్రం అంత్యక్రియలు.. రాత్రి ఇంటికి


Next Story