కొవిడ్ నుంచి కోలుకున్న వారికి గుడ్‌న్యూస్!

by  |
Mild COVID-19 induces
X

దిశ, ఫీచర్స్ : తేలికపాటి కొవిడ్ -19(మైల్డ్ కొవిడ్) నుంచి కోలుకున్న పేషెంట్స్.. నెలలు గడిచినా తమ శరీరంలో రోగనిరోధక కణాలను కలిగి ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. SARS CoV2 వైరస్‌కు వ్యతిరేకంగా ప్రతిరోధకాలను నిరంతరం ఉత్పత్తి చేయడంతో పాటు, అవి జీవితకాలం ఉండే అవకాశముందని తేలింది. సెయింట్‌లోని వాషింగ్టన్ యూనివర్శిటీ స్కూల్ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల అధ్యయనంలో ఇటీవలే వెల్లడైన అంశాలు తాజాగా నేచర్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

సాధారణంగా వైరల్ ఇన్‌ఫెక్షన్ సోకిన తర్వాత రోగనిరోధక కణాలు అధికంగా విడుదలై, రక్తంలో ప్రవహించడంతో పాటు యాంటీబాడీ స్థాయిలను పెంచుతాయి. అయితే ఇన్‌ఫెక్షన్ నుంచి కోలుకున్న తర్వాత అటువంటి కణాలు చాలా వరకు చనిపోయి, యాంటీబాడీ స్థాయిలు కూడా పడిపోతాయి. ఇక యాంటీబాడీ-ఉత్పత్తి చేసిన కణాలన్నీ ఎముక మజ్జకు వలసొచ్చి అక్కడ స్థిరపడతాయన్న విషయం తెలిసిందే. సాధారణంగా వీటిని దీర్ఘకాలిక ప్లాస్మా కణాలు అని పిలుస్తాం. కాగా తీవ్రమైన ఇన్‌ఫెక్షన్ తర్వాత యాంటీబాడీ స్థాయిలు తగ్గడం సాధారణమే అయినా అవి సున్నాకు తగ్గవని స్పష్టం చేసిన పరిశోధకులు.. మైల్డ్ సింప్టమ్స్ నుంచి కోలుకున్న 11 నెలల తర్వాత కూడా ఆయా వ్యక్తుల్లో యాంటీబాడీస్‌‌ను ఉత్పత్తి చేసే కణాలు ఉన్నట్టు గుర్తించారు. ఇవి లైఫ్‌టైమ్ యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేస్తాయని వెల్లడైంది. దీర్ఘకాలిక రోగనిరోధక శక్తికి ఇది బలమైన సాక్ష్యంగా నిలుస్తుండగా.. వైరస్‌తో మన శరీరం పోరాడేందుకు వీలుగా రక్తంలోకి ప్రతిరోధకాలను నిరంతరం స్రవిస్తాయని అధ్యయనంలో తేలింది.

antibodies

అధ్యయనం కోసం 80 మందిని పరీక్షించిన పరిశోధకులు.. మైల్డ్ సింప్టమ్స్ నుంచి బయటపడ్డ 18 మంది కొవిడ్ రోగుల నుంచి ఎముక మజ్జను పరీక్షించారు. ఆ తర్వాత మరో నాలుగు నెలల తర్వాత రెండో ఎముక మజ్జను టెస్ట్ చేశారు. ఊహించినట్లుగానే కొవిడ్ -19 బాధితుల రక్తంలో యాంటీబాడీ స్థాయిలు ఇన్‌ఫెక్షన్ తర్వాత ప్రారంభ నెలల్లోనే పడిపోగా, ఆ తర్వాత ఎక్కువగా ఉత్పత్తి అవుతాయని తెలుసుకున్నారు. 18లో 15 మంది యాంటీబాడీ-ఉత్పత్తి కణాలను కలిగి ఉండగా, ఇవి ముఖ్యంగా కొవిడ్ -19కి కారణమయ్యే వైరస్‌ను లక్ష్యంగా చేసుకుంటాయని తెలిసింది. ఇక కొవిడ్ -19 బారినపడని 11 మందిలో ఎవరికి కూడా ఎముక మజ్జలో యాంటీబాడీ ఉత్పత్తి చేసే కణాలు లేవని శాస్త్రవేత్తలు తెలిపారు.

ఇన్‌ఫెక్షన్ వచ్చిన రెండు, మూడు వారాల తర్వాత ఆయా వ్యక్తుల శరీరాల నుంచి వైరస్ క్లియర్ అవుతుంది. అందువల్ల ఏడు లేదా 11 నెలల తర్వాత క్రియాశీల రోగనిరోధక శక్తి కణాలు ఉత్పత్తి అవుతాయి. లక్షణాలు లేని వ్యక్తులు కూడా దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని కలిగి ఉండే అవకాశం ఉంది. అయితే మరింత తీవ్రమైన ఇన్ఫెక్షన్‌ను భరించిన వారు భవిష్యత్తులో వచ్చే వ్యాధి నుంచి రక్షణ పొందుతారా? అనే దానిపై ఇంకా పరిశోధన జరగలేదు. వ్యాక్సినేషన్ దీర్ఘకాలికంగా యాంటీబాడీ-ఉత్పత్తి కణాలను ప్రేరేపిస్తుందా? లేదా? అనే అంశాన్ని కూడా మేము అధ్యయనం చేస్తు్న్నాం.

– అలీ ఎలెబెడి. మాలిక్యులర్ మైక్రోబయాలజీ అసోసియేట్ ప్రొఫెసర్, సీనియర్ రచయిత

Next Story

Most Viewed