వైరస్‌లను దరిచేరనివ్వని వస్త్రం

by  |
వైరస్‌లను దరిచేరనివ్వని వస్త్రం
X

దిశ, వెబ్‌డెస్క్: కాలుష్యం, దుమ్ము, ధూళి వల్ల చర్మం మీద దురద రావడం, కలుషిత గాలిని పీల్చడం వల్ల వైరస్‌లు శరీరంలోకి ప్రవేశించి శ్వాసకోశ జబ్బులు రావడం ఈరోజుల్లో ఎక్కువైంది. ఐఐటీ మద్రాస్‌లో చదువుకున్న దీప్తి నాతలాకు కూడా తాను ఆఫీసుకు వెళ్తున్నపుడు, వస్తున్నపుడు ఇలాగే జరిగేది. అయితే ఆమె ఈ పరిస్థితిని ఎదుర్కోవాలనుకుంది. దీని నుంచి తనతో పాటు అందరికీ ఉపశమనం కల్పించాలనుకుంది. అందుకే బ్యాక్టీరియాను, వైరస్‌ను దరిచేరనివ్వని వస్త్రాన్ని రూపొందించింది. ఇప్పుడు అదే వస్త్రంతో మాస్కులు, స్కార్ఫ్‌లు తయారు చేసి హీకాల్ అనే స్టార్టప్ పెట్టి విక్రయిస్తోంది. ఆమె రూపొందించిన ఫ్యాబ్రిక్‌కు హెచ్1ఎన్1, ఇకొలీ, సాల్మోనెల్లాలతో పాటు కొవిడ్ 19 కూడా నిరోధించగలదని నిరూపితమైందని దీప్తి చెప్పింది.

కాలిఫోర్నియాలో కొన్నాళ్లు పని చేసి, ఇండియాకు వచ్చిన తర్వాత ఇక్కడ దుమ్ము ధూళి నుంచి రక్షణ కోసం అందరూ దుప్పట్టాలు, కర్చీఫ్‌లు ఉపయోగించడాన్ని దీప్తి గమనించింది. అలా ఉపయోగించిన కొన్ని కర్చీఫ్‌లు, దుప్పట్టాలను పరీక్షకు పంపించగా అవి పొల్యూషన్‌లో 10 శాతాన్ని కూడా ఆపలేకపోతున్నాయని తేలింది. అలాగే సింథటిక్ వస్త్రాలతో తయారు చేసిన కర్చీఫ్‌ల వల్ల చర్మానికి హాని కలుగుతోందని అందుకే తాను సహజంగా తయారైన వస్త్రాన్ని తయారుచేయాలని గట్టిగా నిర్ణయించుకుంది. హీకాల్ పేరుతో ఒక వస్త్రాల తయారీ స్టార్టప్‌ను ప్రారంభించింది. అలా తన బ్రాండ్ పేరు మీదుగా శుభ్రం చేసుకుని, ధరించగల ఫేస్ మాస్క్‌లు, స్కార్ఫ్‌లను రూపొందించి, అమ్మడం మొదలుపెట్టింది. స్వతహాగా నానో సైంటిస్ట్ అయిన దీప్తి, సర్జికల్ మాస్క్‌లు, ఎన్95 మాస్క్‌లు ధరించడాన్ని వ్యతిరేకిస్తుంది. తాను తయారు చేసిన వస్త్రం బయోడీగ్రేడబుల్ అని చెబుతూ, కొవిడ్ 19 తర్వాత హీకాల్ మాస్క్‌లకు మంచి పేరు వచ్చిందని దీప్తి వెల్లడించింది.


Next Story

Most Viewed