- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

మావోయిస్టు పార్టీ ఓటమికి దారితీసిన అనేక కారణాల్లో నగరాలను, పట్టణాలను వదిలేయడం ఒకటి. ఈ కారణంగా పార్టీకి రెండు రకాలుగా నష్టం జరిగింది. మొదటి నష్టం ఏమిటంటే నగరాల్లో, పట్టణాల్లో ఉండే విద్యార్థులు, విద్యావంతులు, కార్మికులు-ఉద్యోగుల నుంచి పార్టీలోకి రిక్రూటుమెంటు ఆగిపోయింది. సిద్ధాంతం, రాజకీయాల పట్ల అవగాహన ఉండి నాయకత్వ స్థానాల్లోకి వేగంగా ఎదిగే కార్యకర్తలు కరువయ్యారు. కేవలం ఆదివాసీ, వెనకబడ్డ ప్రాంతాలకు చెందిన అంతగా చదువుకోని వర్గాల నుంచి మాత్రమే రిక్రూటుమెంటు ఉన్న కారణంగా కేడర్లు ఉన్నా లీడర్లు దొరకని పరిస్థితి ఎదురైంది. ఎప్పుడో 1975-95 కాలంలో పార్టీలోకి వచ్చిన విద్యావంతులు మాత్రమే.. వయసు మీరినా, ఎన్నో రకాల పరిమితులు ఏర్పడినా.. పై కమిటీల్లో కీలక స్థానాల్లో ఉండిపోయారు. అక్కడక్కడా కొందరు ఆదివాసీ కేడర్లు పై కమిటీలకు ప్రమోట్ అయినా, మిలిటరీ రంగంలో వారికున్న నైపుణ్యం, అనుభవం మూలంగానే ఆ పొజిషన్లకు వచ్చారు. వారికున్న సిద్ధాంత పరిజ్ఞానం తక్కువే.
1977లో కొండపల్లి సీతారామయ్య (కేఎస్) నాయకత్వంలో సాయుధ పోరాట తాత్కాలిక విరమణ తర్వాత ప్రజాసంఘాల ఏర్పాటుపై పీపుల్స్ వార్ పార్టీ కేంద్రీకరించింది. ఆర్ఎస్‌యూ (రాడికల్ విద్యార్థి సంఘం), ఆర్‌వైఎల్ (రాడికల్ యువజన సంఘం) కమిటీలు పల్లెలతో పాటు పట్టణాల్లో సైతం ఏర్పడి బలపడ్డాయి. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విశాఖ, తిరుపతి వంటి నగరాలు, పట్టణాలు, యూనివర్సిటీలు ఉద్యమ కేంద్రాలుగా మారాయి. పార్టీకి, ప్రజాసంఘాలకు చెందిన పట్టణ కమిటీలు, ఆర్గనైజర్లు ప్రతి పట్టణంలోనూ చురుగ్గా పని చేసేవారు. ఫలితంగా, ఆ కాలంలో చదువుకున్న వర్గాల నుంచి ఉద్యమంలోకి భారీగా ఫుల్ టైమర్ల రిక్రూటుమెంటు జరిగింది.
1985 తర్వాత పోలీసు నిర్బంధం తీవ్రం కాగా, దాన్ని ఎదుర్కోవడంలో పార్టీ వైఫల్యం చెందిన కారణంగా పలువురు పట్టణ ఆర్గనైజర్లు ప్రాణాలు కోల్పోయారు. అందుకు ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించకుండానే పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. చనిపోగా, మిగిలిన పట్టణ కేడర్లను మైదాన ప్రాంతాలకు, అడవులకు తరలించింది. పట్టణాల ప్రజాసంఘాల్లో పని చేసే వారిని అడవికి పిలిచి గైడ్ చేసే తప్పుడు పద్ధతి అలవాటై అనేక నష్టాలకు దారితీసింది. 2004 శాంతి చర్చల నాటికి మైదానాల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురుకావడంతో అక్కడి దళాలను కూడా అడవులకు పంపడం అనివార్యమైంది. దరిమిలా, పట్టణాల్లో, మైదానాల్లో పనిచేసే పార్టీ కార్యకర్తలు ఎవరూ లేకుండా పోయారు. విద్యార్థుల సమీకరణకు బ్రేక్ పడింది. దీనికితోడు ప్రభుత్వం ప్రజాసంఘాలను కూడా నిషేధించడంతో వాటి అస్తిత్వం క్రమంగా కనుమరుగైంది.
2005-25 మధ్య ఉద్యమంలోకి వచ్చిన విద్యావంతుల శాతం నామమాత్రమే. కేవలం విప్లవకారుల కుటుంబాల నుంచి మాత్రమే వేళ్ల మీద లెక్కబెట్టదగిన యువతీ యువకులు పార్టీలోకి వచ్చారు. ఈ పరిస్థితుల్లో సిద్ధాంత, రాజకీయ పటిమ కలిగిన నాయకత్వ లేమి పార్టీని పట్టి పీడించింది. 1975-95 మధ్య వచ్చినవాళ్లే దిక్కయ్యారు. 60 ఏళ్లు దాటినవాళ్లుగా వాళ్లకు పలు పరిమితులు ఏర్పడడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి దాపురించింది. స్థానిక ఆదివాసులతో కూడిన మిలిటరీ నాయకత్వం ఓ మేరకు ఉండడం, సైద్ధాంతిక రాజకీయాలు తెలిసిన పార్టీ నిర్మాణ నాయకత్వం కొరవడడం అనేక తప్పులకు దారితీసింది. వీటికి తోడు విముక్తి ప్రాంతాల స్వప్నం డామినేట్ చేసి, పార్టీ నిర్మాణం అనివార్యంగా మిలిటరీ(పీఎల్జీఏ) చేతుల్లోకి వెళ్లిపోయింది.
రెండవ రకం నష్టం ఏమిటంటే.. దేశంలోని ప్రధాన నగరాల్లో, ముఖ్యమైన పట్టణాల్లో తమకున్న నిర్మాణాలను ఖాళీ చేసి మొత్తం నాయకత్వం అడవులు కేంద్రంగా పనిచేయడం. ఎమర్జెన్సీకి ముందు నుంచే కేఎస్, సత్యమూర్తి వంటి నేతలు కేడర్లను కలువడానికి అప్పుడప్పుడు ఫీల్డుకు వెళ్లినా.. సమావేశాలు, క్లాసుల నిర్వహణ, విశ్రాంతి, అధ్యయనం తదితర అవసరాల కోసం పొరుగు రాష్ట్రాల్లోని సరిహద్దు పట్టణాలను ఉపయోగించుకునేవాళ్లు. నాగపూర్, చంద్రపూర్, రాయచూర్, గుల్బర్గా, నాందేడ్ వంటి పట్టణాల్లో వారికి స్థావరాలుండేవి. 1984లో కేఎస్ పోలీసు నిర్బంధం నుంచి తప్పించుకున్న తర్వాత పార్టీ కేంద్ర కమిటీ మొత్తం బెంగళూరు, చెన్నై కేంద్రాలుగా పనిచేసింది. 1987 తర్వాత ఏపీ రాష్ట్ర కమిటీ సైతం ఈ నగరాల నుంచే కార్యకలాపాలు నిర్వహించింది. 1995 కల్లా కేంద్ర, రాష్ట్రాల కమిటీలు దేశం నలుమూలలా ఉన్న నగరాలు, పట్టణాలను సేఫ్ హౌసెస్‌గా ఉపయోగించుకున్న పరిస్థితి ఉండింది.
అయితే, 2007 పార్టీ కాంగ్రెస్ తర్వాత జరిగిన భారీ నష్టాలతో పార్టీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యమ ప్రాంతాలకు దూరంగా బయటి నగరాల్లో నాయకులు షెల్టర్ తీసుకోవడం మూలంగా ఫీల్డుకు, ఆచరణకు దూరమవుతున్నారని, సులభంగా శత్రుబలగాల చేజిక్కి ప్రాణాలు కోల్పోతున్నారని సమీక్షించి.. అందరినీ అడవిలోకి రావాలని ఆదేశించింది. అప్పటికి డీకే, జార్ఖండ్‌లలోని కొన్ని లోతట్టు అటవీ ప్రాంతాలు పార్టీ కంట్రోలులోకి రావడం అందుకు వీలు కల్పించింది. దరిమిలా పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి సహా సెంట్రల్ రీజనల్ బ్యూరో (సీఆర్బీ) బాధ్యతలు చూసే పొలిట్‌బ్యూరో, సీసీ సభ్యులందరూ తమ స్థావరాలను అబూజ్‌మాడ్, దక్షిణ బస్తర్ అడవుల్లోని రోడ్లకు, పెద్ద గ్రామాలకు దూరంగా ఉన్న లోతట్టు కొండలకు చేరుకున్నారు. ఈస్టర్న్ రీజనల్ బ్యూరో సభ్యులందరూ సారండ, బుఢా పహాడ్ లోతట్టు అడవులకు వెళ్లారు. 2008 నుంచి 2024 వరకూ గణపతి మాడ్‌లోనే ఉండడం, తదుపరి కార్యదర్శి బసవరాజు కూడా చనిపోయేవరకూ అక్కడే ఉండడం ఇందుకు తార్కాణం. మధ్యలో అవసరాల రీత్యా తాత్కాలికంగా ఫీల్డుకు వెళ్లినా, అందరి స్థిరనివాసం మాత్రం తమ స్థావరాల్లోనే ఉండేది. వీరి స్థావరాల రక్షణ కోసం ప్రత్యేకించి పీఎల్జీఏ ప్లాటూన్లు, కంపెనీలను, నిత్యావసరాలను అందించడానికి సరఫరా టీంలను, సమన్వయం కోసం కమ్యూనికేషన్ సిస్టమ్‌ను సైతం ఏర్పాటు చేసుకున్నారు. సోలార్ పవర్ చార్జింగ్ పాయింట్లను, జెనరేటర్లను, ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్కులు, పెన్‌డ్రైవ్‌లను సమకూర్చుకున్నారు.
ఫలితంగా అప్పటినుంచి నగరాల్లో, పట్టణాల్లో మావోయిస్టు పార్టీకి ఎలాంటి యంత్రాంగం లేకుండా పోయింది. అయితే, 2024లో ఆపరేషన్ కగార్ మొదలైన తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. శత్రబలగాలు కార్పెట్ క్యాంపింగ్ ఎత్తుగడలతో మాడ్‌ను చుట్టముట్టడం, పెరిగిన ఇన్ఫార్మర్ నెట్వర్క్ ఇచ్చిన సమాచారంతో కేంద్రీకరించి దాడులు చేయడం మూలంగా అనేక మంది కేంద్ర, రాష్ట్ర కమిటీల నాయకులు చనిపోయారు. ఈ నష్టాలను సమీక్షించిన పొలిట్‌బ్యూరో 2024 ఆగస్టులో ఆత్మరక్షణ చర్యలతో కూడిన సర్క్యులర్‌ను విడుదల చేసింది. అడవుల్లోని నేతల స్థావరాలు ఇక ఎంతమాత్రం సేఫ్ కాదని అర్థమైనా.. మరో ప్రత్యామ్నాయం దొరక్క జాగ్రత్తగా, అలర్ట్‌గా ఉండాలని చెప్పడం తప్ప ఏమీ చేయలేకపోయింది. తదనంతర కాలంలో కొందరు నాయకులను బయటికి పంపి రక్షించుకోవాలని నిర్ణయాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా అప్పటికే మోసుకు తిరుగుతున్న గణపతిని బయటకు పంపించారు. సీసీ సభ్యులు రాజు, కోస దాదాలు కూడా బయటకు వెళ్లారు. అయితే, తాము అక్కడ నిలదొక్కుకోవడం ఇబ్బందిగా ఉందని, స్థానికంగా ఎలాంటి సంబంధాలు లేకుండా రక్షణ దొరకడం అసాధ్యమని వాళ్లు వాపోయినట్లు సమాచారం.
మొత్తంగా చూస్తే.. నగరాలు, పట్టణాల్లో పార్టీ నిర్మాణం ఉండివుంటే, కీలక నాయకత్వం ఉద్యమ ప్రాంతాలకు దూరంగా సేఫ్ హౌసెస్‌ను అలాగే కొనసాగించి ఉంటే ఏం జరిగివుండేది?
- కేంద్ర, రాష్ట్ర కమిటీల్లో 2000 తర్వాత పార్టీలోకి వచ్చిన కొత్త తరం యువతీ యువకులు ఉండేవాళ్లు. వాళ్లకు బయటి సమాజంలో ప్రపంచీకరణ-ప్రైవేటీకరణ తెచ్చిన మార్పులు సమగ్రంగా అర్థమయ్యేవి. మారిన ఉత్పత్తి సంబంధాల నేపథ్యంలో విప్లవం వ్యూహం-ఎత్తుగడలు మారాలని ఒత్తిడి తెచ్చేవాళ్లు.
- అలా కాకుండా ఎప్పుడో 1955-70 కాలంలో పుట్టి, 1975-95 కాలంలో పార్టీలోకి వచ్చిన వాళ్లే నిర్ణయాత్మక స్థానాల్లో ఉన్నందువల్ల పై కమిటీల సభ్యులు ఆ మార్పులను చూడ నిరాకరించారు. ఇంకా అర్ధవలస-అర్ధభూస్వామ్యమే ఉందనే భ్రమల్లో తేలియాడి దీర్ఘకాలిక సాయుధ పోరాట పంథాను గుడ్డిగా కొనసాగించారు. పార్టీ ఓటమికి కారణమయ్యారు.
- ప్రధాన కార్యదర్శి సహా వ్యూహాత్మక నాయకత్వం కనుక ఫీల్డుకు దూరంగా బయటి నగరాలు, పట్టణాల్లోని సేఫ్ హౌసెస్‌లో తలదాచుకుని వుంటే మావోయిస్టు పార్టీకి ఇప్పటి పరిస్థితి వచ్చేదే కాదు. కగార్ చుట్టివేత దాడులు ఫీల్డులో ఉన్న కింది కమిటీల నేతలను, కేడర్లను, పీఎల్జీఏను నష్టపర్చినప్పటికీ మొత్తం పార్టీ నిర్వీర్యమయ్యేది కాదు. గందరగోళ పరిస్థితులు ఏర్పడేవి కావు.
- పార్టీ శ్రేణులను ఎప్పటికప్పుడు అంతర్గత సర్క్యులర్ల ద్వారా గైడ్ చేస్తూ, ప్రకటనల ద్వారా ప్రజలకు సందేశమిస్తూ విప్లవోద్యమాన్ని పైనుంచి కొనసాగించగలిగే సామర్థ్యం బయట ఉన్న నాయకత్వానికి ఉండేది. ఎన్ని నష్టాలు జరిగినా, ఎంత మంది లొంగిపోయినా చొరవ వ్యూహాత్మక నాయకత్వం చేతుల్లోనే ఉండేది.
- దూడం మార్కండేయ






