ధూల్‌పేటలో ఇప్పుడు అది లేదు

by  |
ధూల్‌పేటలో ఇప్పుడు అది లేదు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: వారంతా కళను నమ్ముకున్నవారు. రంగురంగుల ప్రతిమలను రూపొందించి ప్రతిఫలం పొందేవారు. వినాయక చవితి వచ్చిందంటే వారికి పండుగే. విగ్రహాల తయారీ, అమ్మకాలతో బిజీబిజీగా మారేవారు. పండుగ ముగిసిన రెండు నెలల నుంచే వచ్చే ఏడాదికి విగ్రహాలను తయారు చేయడంలో నిమగ్నమయ్యేది. కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టి ముడిసరుకు దిగుమతి చేసుకునేది. కోల్​కతా, ఛత్తీస్​గఢ్​, మహారాష్ట్ర, కర్నాటక, జార్ఖండ్ తదితర రాష్ట్రాలకు చెందిన కార్మికులకు లక్షలాది రూపాయల అడ్వాన్సులు చెల్లించి హైదరాబాద్​కి తీసుకువచ్చేది. ధూల్​పేట కేంద్రంగా భారీ విగ్రహాల తయారీకి పూనుకునేది. వినాయక ప్రతిమల తయారీకి పెట్టింది పేరు. వేలాది మంది కార్మికులు.. వారి చేతిలో రూపుదిద్దుకుంటున్న తీరొక్క ప్రతిమలతో ధూల్​పేట సందడిగా ఉండేది. మాయదారి మహమ్మారి విగ్రహాల తయారీ దారుల ఆశలపై నీళ్లుచల్లింది. లాక్​డౌన్​తో పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. కార్మికులు స్వగ్రామాలకు వెళ్లడంతో ధూల్​పేట కళతప్పింది. అప్పులపాలై వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి.

కరోనా దెబ్బకు ధూల్ పేటలో వినాయక విగ్రహాల తయారీ పనులు నిలిచిపోయాయి. విగ్రహాల తయారీ కోసం చేసిన అప్పులు వెంటాడుతున్నాయి. దీంతో తయా రీ దారులు జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్నారు. సాధారణంగా ప్రతి యేడాది వినాయక నవరాత్రులు ముగిసిన అనంతరం నెల రోజుల వ్యవధిలో తిరిగి వినా యక విగ్రహాల తయారీ ప్రక్రియ మొదలవుతుంది. ఇందు కోసం కోల్​కత్తా, ఛత్తీస్ గఢ్​, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖం డ్ తదితర రాష్ట్రాల కు చెందిన కార్మికులకు లక్షలాది రూపాయలు అడ్వాన్స్ చెల్లించి నగరానికి తీసుకువచ్చేవారు. వారితో పెద్ద సంఖ్యలో భారీ విగ్రహాలను తయారు చేయించేవారు. గతేడాది వినాయక చవితి ముగిసిన రెండునెలల వ్యవధిలో ధూల్ పేట తయారీ దారులు పనులు మొదలు ప్రారంభించారు.

కరోనా వారి పాలిట శాపంగా మారింది. మార్చి నెలలో కరోనా ప్రభావం చూపే నాటికే ఇక్కడి తయారీ దారులు కోట్లాది రూపా యలు అప్పు తెచ్చి విగ్రహాల తయారీకి పెట్టుబడులు పెట్టారు. ఇతర రాష్ట్రాల నుంచి ముడి సరుకులు దిగుమతి చేసుకోవడంతో పాటు కార్మికులకు వేతనాల కింద లక్షలాది రూపాయలు అడ్వాన్స్​గా చెల్లించారు. అనంత రం కరోనా లాక్ డౌన్ మొదలు కావడంతో పనులు ముందుకు సాగక పోవడంతో కార్మికులు వారి స్వ స్థలాలకు వెళ్లిపోయారు. దీంతో విగ్రహాల తయారీ అర్ధాంతరంగా నిలిచి పోయింది. పెట్టిన పెట్టుబడులతో తయా రీ దారులకు అప్పులు మిగిలిపోయాయి. కార్మికులకు ఇచ్చిన అడ్వాన్సులు కూడా అప్పుల జాబితాలో చేరాయి.

వీధిన పడిన 35 వేల కుటుంబాలు..

ధూల్ పేటలోని సుమారు 600 విగ్రహ తయారీ కార్ఖానాలు ఉన్నాయి. ఇక్కడ తయారయ్యే విగ్రహాలకు దక్షిణ భారత్ లో మంచి పేరుంది. కేవలం తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకు వెళ్తుంటారు. ఇందు కోసం నెలల ముందుగానే ఇక్కడికి వచ్చి తమకు కావల్సిన వినాయక ప్రతిమల రూపం తయారీదారులకు చెప్పి అడ్వాన్స్ చెల్లించేవారు. వినా యక చవితికి వారం రోజుల ముందు వచ్చి రెడీగా ఉన్న విగ్రహాలను తీసుకు వెళ్తుంటారు. ఈ యేడాది కరోనా ప్రభావంతో తయారీ నిలిచిపోగా సుమారు 35 వేల కార్మికుల కుటుంబాలు ఉపాధిని కోల్పోయి వీధిన పడ్డాయి. ఇందులో 25 వేల మంది స్థానికులు కాగా సుమారు 10 వేలమంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారు ఉన్నారు.

భారీ విగ్రహాల తయారీ..

భారీ విగ్రహాల తయారీకి ధూల్ పేట పెట్టింది పేరు. ఇక్కడ 25 నుంచి 35 అడుగుల ఎత్తులో విగ్రహాలు తయారవుతాయి. ఐతే ఈ యేడాది కరోనా నేపథ్యంలో రెండు అడుగులకు మించి విగ్రహాలు తయారీ చేయరాదని, నిమజ్జనం కోసం కూడా ప్రభుత్వం పలు రకాల ఆంక్షలు పెట్టడంతో భారీ విగ్రహాల తయారీ పూర్తిగా నిలిచిపోయింది. చిన్న విగ్రహాలను సైతం మహారాష్ట్ర నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతీ వినాయక చవితి సీజన్ లో దూల్ పేట్ లో సుమారు 35 వేల విగ్రహాలు రూపు దిద్దుకుంటుండగా ఈ యేడాది కనీసం వెయ్యి విగ్రహాలు కూడా లేకపోవడం గమనార్హం. వినాయక చవితికి పక్షం రోజుల ముందే ఇక్కడి రోడ్లను బ్లాక్ చేసి కేవలం విగ్రహాలను తరలించే వాహనాలను మాత్రమే అనుమతించేవారు. ఇప్పడు మార్కెట్ కళ తప్పింది. రోడ్లు బోసి పోయి కనిపిస్తున్నాయి.

రూ.2కోట్ల పెట్టుబడి పెట్టా : సుందర్ కళాకార్

ఈ యేడాది వినాయక విగ్రహాల తయారీ కోసం లాక్ డౌన్ మొదలయ్యే నాటికే రూ.2 కోట్ల పెట్టుబడి పెట్టా. ప్రతీ యేడాది ఇతర రాష్ట్రాల నుంచి పని వాళ్లకు వేలాది రూపాయలు అడ్వాన్స్ చెల్లించి నగరానికి తీసువచ్చేది. సుమా రు 300 నుండి 500 వరకు విగ్రహాలు తయారు చేసే వాడిని. విగ్రహాల కోసం ముందస్తుగా అడ్వాన్స్ ఇచ్చి వెళ్లేవారు. కరోనా లాక్ డౌన్ తో విగ్రహాల తయారీ పూర్తిగా నిలిచిపోయింది. మెటీరియల్ కొనుగోలు కోసం చేసిన పెట్టుబడితో పాటు కళాకారులకు ఇచ్చిన అడ్వాన్స్ లు తిరిగి రాలేదు. కార్మి కులు సొంత రాష్ట్రాలకు వెళ్లిపోయారు. కోట్లాది రూపాయల అప్పు మిగిలిపోయి. ఏం చేయాలో అర్థం కావడం లేదు.

100 వరకు విగ్రహాలు తయారు చేసేవాడిని: టెక్నాలజీ లక్ష్మణ్

టెక్నాలజీ సాయంతో విగ్రహాలు తయారు చేసే వాడిని. పలు రకాల వేషధారణలో వినాయక విగ్రహాలను తయారు చేసేందుకు ముందుగా కంప్యూటర్ గ్రాఫిక్స్ క్రియేట్ చేసి కొనుగోలు దారులకు చూపించేది. వారికి నచ్చిన విధంగా తయారు చేసి విక్రయాలు జరిపే వాడిని. కొనుగోలు దారులు కూడా వారికి నచ్చిన ఆకృతులను ఎంచుకుని అడ్వాన్స్ చెల్లించే వారు. ఇలా ప్రతీ ఏడాది సుమారు 100 వరకు విగ్రహాలు రూపొందించి విక్రయించి ఉపాధి పొందే వాడిని. ఈ సంవత్సరం కరోనాతో మొత్తం వ్యాపారం తుడిచి పెట్టుకుపోయింది.



Next Story

Most Viewed