కాంగ్రెస్‌లో కలవరం.. రేవంత్ ఇలాకాలో హస్తానికి కీలక నేతల ‘హ్యాండ్’.!

by  |
కాంగ్రెస్‌లో కలవరం.. రేవంత్ ఇలాకాలో హస్తానికి కీలక నేతల ‘హ్యాండ్’.!
X

దిశ ప్రతినిధి, మేడ్చల్ : కాంగ్రెస్ పార్టీలో అసంతృప్త జ్వాలలు తారస్థాయికి చేరుకున్నాయి. మండల, మున్సిపాలిటీ అధ్యక్షుల నియామకం ఆ పార్టీని తీవ్రంగా కలవరానికి గురి చేస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలో టీఆర్‌ఎస్ దూకుడు పెరిగినా, బీజేపీ హవా విస్తరించినా.. కాంగ్రెస్ పార్టీ మాత్రం అనేక ఒడిదొడుకులు ఎదుర్కొంటూ తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నది.

దళిత గిరిజన సభతో జోష్..

ఇదే జిల్లా నుంచి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా ప్రాతినిధ్యం వహిస్తుండగా, ఓ జడ్పీటీసీ, కొందరు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు ఎంపికయ్యారు. అయితే, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్(జిల్లా అధ్యక్షుడు కూడా), కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి లాంటి వారు పార్టీకి దూరమయ్యారు. పలువురు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు మంత్రి మల్లారెడ్డి హయంలో గూలాబీ గూటీకి చేరారు. ఇలా కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షోభాల నుంచి గట్టెక్కుతూ.. ఉన్న కేడర్‌ను కాపాడుకునే ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో గత నెల 24, 25వ తేదీలలో మూడు చింతలపల్లిలో నిర్వహించిన దళిత గిరిజన దండోర సభతో పార్టీ శ్రేణులో జోష్ పెరిగింది. దీంతో పార్టీ శ్రేణుల మధ్య పదవుల కోసం పైరవీలు మొదలయ్యాయి.

రచ్చకెక్కిన విభేధాలు..

జిల్లాలోని పలు మున్సిపాలిటీలు, మండలాలు, కార్పొరేషన్ అధ్యక్షులను ఈ నెల 8న జిల్లా అధ్యక్షుడు నందికంటి శ్రీధర్ నియమించారు. ఆయా ప్రాంతాలలో పదవులు దక్కని నేతలంతా జిల్లా అధ్యక్షుడి నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. పార్టీలో మిగితా వారితో చర్చించకుండానే అధ్యక్షులుగా ఎలా నియమిస్తారని, నందికంటి శ్రీధర్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తున్నారు. మేడ్చల్ మండల మాజీ అధ్యక్షుడు వరదా రెడ్డి నియోజకవర్గ కో-ఆర్డినేటర్లు తోటకూర జంగయ్యయాదవ్, హరివర్దన్ రెడ్డిలపై ధ్వజమెత్తారు.

తమ ఇష్టానుసారంగా తమకు నచ్చిన వారికి పదవులను ఇప్పించుకున్నారని, సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను సంప్రదించకుండా పదవులు ఎలా ఇస్తారని మండిపడ్డారు. యూత్ కాంగ్రెస్ పార్టీ నేత రవి ముదిరాజ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసే కార్యకర్తలకు కాకుండా సొంత డబ్బా కొట్టుకుంటూ ఫోటోలకు పోజులు ఇచ్చే నాయకులకే పదవులను కట్టబెడుతున్నారని ఆరోపిస్తున్నారు. మేడ్చల్‌లో గ్రూపు రాజకీయాలను ప్రోత్సహిస్తూ.. పార్టీని నిర్వీర్యం చేసే కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. వీరితోపాటు జవహర్ నగర్, కీసర, మూడు చింతలపల్లి, ఘట్ కేసర్, నాగారం, గుండ్ల పోచంపల్లి తదితర ప్రాంతాల్లోనూ అసంతృప్తులు నియామకాలపై భగ్గు మంటున్నారు.

పక్క పార్టీలవైపు చూపు..

మండల, మున్సిపాలిటీ, కార్పొరేషన్ల అధ్యక్ష పదవులపై కన్నేసిన నేతలు.. పదవులు దక్కకపోవడంతో టీఆర్ఎస్, బీజేపీ‌లలో చేరేందుకు పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగానే అధికార టీఆర్ఎస్ పార్టీ సైతం ఆపరేషన్ ఆకర్ష్‌ను పకడ్బంధీగా అమలు చేస్తున్నప్పటికీ, దీన్ని అడ్డుకునే చర్యలు మాత్రం హస్తం పార్టీలో కరువయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం నియోజకవర్గ స్థాయి నాయకులు, కేడర్ మధ్య సమన్వయం కుదుర్చలేక పోతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

పార్టీ నాయకత్వం ఫిరాయింపుల విషయంలో పెద్దగా పట్టించుకోకపోతుండటం కూడా టీఆర్‌ఎస్‌కి అనుకూలంగా మారుతోంది. కాంగ్రెస్‌లో చాలా సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఎలాంటి ఆదరణకు నోచుకోని వారంతా ప్రస్తుతం గులాబీ లేదా కమలం పార్టీ వైపు చూస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని బీజేపీ కూడా సద్వినియోగం చేసుకొని కాంగ్రెస్‌కు ధీటైనా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగేందుకు సిద్ధమవుతోందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇప్పటికే మాజీ జిల్లా అధ్యక్షుడు కూన శ్రీశైలం బీజేపీలో చేరారు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయనకు ఉన్న పరిచయాలతో ఆ పార్టీలోకి కాంగ్రెస్ ముఖ్య నేతలను చేర్పించుకునేందుకు స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లాలోనే పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమనటం చర్చనీయాంశంగా మారింది.


Next Story