మహీంద్రా ఫైనాన్స్ ఆదాయం వృద్ధి

by  |
మహీంద్రా ఫైనాన్స్ ఆదాయం వృద్ధి
X

దిశ, వెబ్‌డెస్క్: మహీంద్రా అనుబంధ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ (మహీంద్రా ఫైనాన్స్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నికర లాభం 34 శాతం పెరిగి రూ. 353 కోట్లకు చేరుకుంది. గతేడాది ఇదే త్రైమాసికంలో కంపెనీ నికర లాభం రూ. 264 కోట్లుగా నమోదైంది. సమీక్షించిన త్రైమాసికంలో కంపెనీ మొత్తం ఆదాయం 5 శాతం పెరిగి రూ. 3,071 కోట్లకు చేరుకోగా, గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో రూ. 2,936 కోట్లుగా నమోదైందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది.

ప్రధానంగా గ్రామీణ, సెమీ అర్బన్ మార్కెట్లలో ఆదరణ ఉన్న మహీంద్రా ఫైనాన్స్ పన్నులకు ముందు లాభాలు గతేడాది రూ. 507 కోట్ల నుంచి రూ. 488 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ 30 నాటికి కంపెనీ కస్టమర్ల సంఖ్య 69 లక్షలు దాటిందని కంపెనీ వెల్లడించింది. నిర్వహణ ఆస్తులు సెప్టెంబర్ 30 నాటికి రూ. 81,682 కోట్లుగా ఉందని, గతేడాది రూ. 72,732 కోట్లతో పోలిస్తే ఈసారి 12 శాతం వృద్ధిని నమోదు చేసినట్టు కంపెనీ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

‘కంపెనీ వ్యాపారాన్ని నిర్వహించేందుకు తగిన మూలధనం, ఆర్థిక వనరులను కలిగి ఉంది. కంపెనీ మూలధనం, రుణ స్థాయిలు బలంగా ఉన్నాయని’ మహీంద్రా ఫైనాన్స్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఇక, కంపెనీ స్థూల నిరర్ధక ఆస్తులు సెప్టెంబర్ చివరి నాటికి 7 శాతంగా ఉన్నాయని, గతేడాది ఇది 7.9 శాతంగా ఉందని, నికర ఎన్‌పీఏలు 6.4 శాతం నుంచి 4.7 శాతానికి తగ్గాయని ప్రకటించింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో మహీంద్రా ఫైనాన్స్ షేర్ ధర 2.86 శాతం క్షీణించి రూ. 130.85 వద్ద ముగిసింది.

Next Story

Most Viewed