‘సర్కారు వారి పాట’లో సూపర్‌స్టార్

by  |
‘సర్కారు వారి పాట’లో సూపర్‌స్టార్
X

సూపర్‌స్టార్ మహేశ్‌బాబు 27వ సినిమాగా పరశురామ్ దర్శకత్వంలో రాబోతున్న చిత్రానికి 'సర్కార్ వారి పాట' అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు నెట్టింట్లో తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ టైటిల్‌నే అధికారికంగా ఖరారు చేస్తూ చిత్రబృందం పోస్టర్‌ను విడుదల చేసింది. నేడు(ఆదివారం) సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు కానుకగా కృష్ణ-మహేశ్ అభిమానులను ఈ విధంగా సర్‌ప్రైజ్ చేశారు. మహేశ్ బాబు ట్విట్టర్‌లో విడుదల చేసిన టైటిల్ పోస్టర్‌లో.. అతడి లుక్స్ చూస్తే, మాస్ ఆడియన్స్‌ను మెప్పించే విధంగా ఉన్నాయి. చెవి పోగుతో పాటు మెడపై రూపాయి సింబల్ టాటూతో మహేశ్ న్యూలుక్‌తో ఆకట్టుకున్నారు. మైత్రీమూవీమేకర్స్- జీఎమ్బీ ఎంటర్ టైన్ మెంట్స్- 14 రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనున్నాయి.

‘2021లో జరగబోయేది సర్కారు వారి పాట, థియేటర్లలో మన సూపర్ గ్లోయింగ్ స్టార్ ఆట, కొనసాగబోయేది బాక్సాఫీస్ వేట, మా 14 రీల్స్.. మైత్రీలకు బంగారు బాట, ఇదే మన అభిమానుల నోట మాట’ అంటూ నిర్మాత అనిల్ సుంక‌ర ‘సర్కారు వారి పాట’ పోస్ట‌ర్ విడుద‌ల చేశారు. కాగా ఈ పోస్టర్‌లో మహేశ్ పూర్తి లుక్ మాత్రం రివీల్ చేయలేదు. సర్కారు వారి పాట అనే పదాన్ని.. మహేశ్ మెడపై గల రూపాయి బిళ్ల టాటూ ప్రతిబింబించేలా ఉంది. ఈ చిత్రంలో మహేశ్ మూడు విభిన్న షేడ్స్‌లో కనిపిస్తాడని ప్రచారంలో ఉండగా.. కియారా అద్వానీని క‌థానాయిక‌గా ఎంపిక చేయ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం, పీఎస్ వినోద్ సినిమాటోగ్రఫీ అందించనున్నారు.

Next Story

Most Viewed