ఫోటో మహేష్ బాబుది.. పేరు అమ్మాయిది!

by  |
ఫోటో మహేష్ బాబుది.. పేరు అమ్మాయిది!
X

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన జగనన్న విద్యాదీవెన ఎంత పకడ్బందీగా జరుగుతున్నదీ కళ్లకు కట్టే సంఘటన కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో చోటుచేసుకుంది. పట్టణ కేంద్రానికి చెందిన పరంపోగు లక్ష్మి అనే యువతి సిద్ధార్థ డిగ్రీ కళాశాలలో బీకాం కంప్యూటర్స్ చదువుతోంది. ఆమెకు జగనన్న విద్యాదీవెన కింద 2019-057-145-21 సంఖ్యతో గుర్తింపు కార్డును మంజూరు చేశారు.

ఈ కార్డులో విద్యార్థిని పేరు పరంపోగు లక్ష్మిగా పేర్కొన్నారు. తల్లి గంగమ్మ, తండ్రి సత్యన్నల పేర్లు కూడా సరిగ్గానే పేర్కొన్నారు. అన్నీ సక్రమంగా ఉంటే బాగోదనుకున్నారో ఏమో కానీ.. ఫోటో మాత్రం ఆమెది వెయ్యలేదు. యువతి చిత్రం ఉండాల్సిన చోట మహర్షి సినిమాలో నటించిన ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు ఫోటో పెట్టారు. సెల్ నెంబర్ కూడా అమ్మాయిది కాకుండా తెలంగాణలోని సిద్ధిపేట జిల్లా నారాయణపేటకు చెందిన కరుణాకర్‌కి చెందినది నమోదు చేశారు.

దీనిపై ఉన్నతాధికారులను సంప్రదించగా కొన్ని కార్డుల్లో తప్పులుదొర్లాయని, వాటిని సరిచేస్తామని వివరణ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షకుపైగా వలంటీర్లు పని చేస్తున్నారు. 50 ఇళ్లను ఒక వలంటీర్‌కు కేటాయించి మరీ వివరాలు సేకరించారు. వీటిని కంప్యూటర్లలో నమోదు చేసే బాధ్యత గ్రామ సచివాలయ ఉద్యోగులకు ఇచ్చారు. ఇన్ని సేవలు అందినా తప్పులు దొర్లడం.. వారి పనితీరును కళ్లకు కడుతోంది.


Next Story