‘మహరాజ్’ వెంటే అసమ్మతి ఎమ్మెల్యేలు!

by  |
‘మహరాజ్’ వెంటే అసమ్మతి ఎమ్మెల్యేలు!
X

దిశ, వెబ్‌డెస్క్:
కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీ కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా బుధవారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ)లో చేరిన విషయం తెలిసిందే. ఆయన మద్దతుదారులైన 22 మంది ఎమ్మెల్యేలు సోమవారమే బెంగళూరు వెళ్లిపోయారు. అక్కడి నుంచి గవర్నర్‌కు తమ రాజీనామా లేఖలను పంపించారు. ఈ రాజీనామాలతో బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొస్తున్న మధ్యప్రదేశ్‌లోని కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. శుక్రవారం(ఈ నెల 13న) బడ్జెట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసమ్మతి ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకొనేందుకు కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులు ఒడ్డుతోంది. సీఎం కమల్‌నాథ్, మాజీ సీఎం దిగ్విజయ్‌సింగ్‌లు తమకు సంపూర్ణ మెజార్టీ ఉందని, అసెంబ్లీలో బలం నిరూపించుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. మరోవైపు కర్ణాటక పీసీసీ చీఫ్, ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ బెంగళూరులో ఉన్న అసమ్మతి ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని, చాలామంది ఎమ్మెల్యేలు వెనక్కి రావడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఈ గందరగోళానికి తెరదించుతూ సింధియా మద్దతుదారులైన ఎమ్మెల్యేలు వరుస వీడియోలను విడుదల చేశారు. తాము మహరాజ్(జ్యోతిరాదిత్య సింధియా) వెంటే వెళ్తామని, ఆయన ఏం చెబితే అదే చేస్తామని ఆ వీడియోల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియోలు కాంగ్రెస్ పార్టీని ఆత్మరక్షణలో పడేశాయి.
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఉద్వాసనకు గురైన ఆరుగురు మంత్రుల వీడియో, ఆడియో క్లిప్పులను బీజేపీ విడుదల చేసింది. బీజేపీలోకి సింధియా వెళ్లినా ఆయనకే తమ మద్దతు అని ప్రకటించారు. తులసి సిల్వత్, గోవింద్ సింగ్ రాజ్‌పుత్, మహేంద్ర సింగ్ సిసోడియా, ఇమర్తి దేవి, ప్రభురామ్ చౌదరి, ప్రద్యుమ్నసింగ్ తోమర్ తదితరుల వీడియో క్లిప్పులు బుధవారం సోషల్ మీడియాను ముంచెత్తాయి. వీటిని జాతీయ, స్థానిక మీడియా ఛానళ్లు ప్రసారం చేశాయి.
‘ఒకవేళ మహరాజ్ నన్ను బావిలో దూకమని కోరితే.. అందకూ సిద్ధమే’ అని మధ్యప్రదేశ్ మాజీమంత్రి ఇమర్తిదేవి ఓ వీడియోలో పేర్కొన్నారు.
మరో మాజీమంత్రి మహేంద్ర సింగ్ సిసోడియా వీడియోలో మాట్లాడుతూ ‘జ్యోతిరాదిత్య సింధియా ఎవరినీ భయపెట్టి ఇక్కడికి తీసుకురాలేదు. కాంగ్రెస్ పార్టీ, సీఎం కమల్‌నాథే ఆయనకు నమ్మకద్రోహం చేశారు. 15 ఏండ్ల తర్వాత మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కారణం సింధియా. ఆయన పడ్డ శ్రమనే. జ్యోతిరాదిత్య సింధియా ఏ పార్టీలోకి వెళ్తే ఆ పార్టీలోకి మేమూ వెళ్తాం. మేమంతా కలిసే ఉన్నాం’ అని చెప్పారు.
మరో మాజీ మంత్రి మాట్లాడుతూ మొత్తం ఈ రోజు 22 మంది ఎమ్మెల్యేలం కలసి ఉన్నామని, రేపూ ఉంటామని, మన స్ఫూర్తిగానే శాసనసభ్యత్వాలకు రాజీనామా చేశామన్నారు.
ఇక్కడ నేను ఇష్టపూర్వకంగానే ఉన్నా. నన్ను ఎవరూ బలవంతపెట్టలేదు అని ఎమ్మెల్యే రక్షా సిరోనియా ఓ వీడియోలో తెలిపారు.

Tags: madhya-pradesh,government,crisis,maharaj videos,madhya-pradesh,mlas,embarrass,congress

Next Story

Most Viewed