మధ్యప్రదేశ్ క్యాబినెట్‌లో సింధియా ముద్ర

by  |
మధ్యప్రదేశ్ క్యాబినెట్‌లో సింధియా ముద్ర
X

భోపాల్: మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కారులో కొత్తగా 28 మంది మంత్రులు చేరారు. గురువారం ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ మాజీ నేత జ్యోతిరాదిత్య సింధియా ముద్ర స్పష్టంగా కనిపించింది. మొత్తం 28 కొత్త మంత్రుల్లో 16 మంది బీజేపీ చట్టసభ్యులు, 12 మంది కాంగ్రెస్ మాజీ నేతలున్నారు. అందులోనూ తొమ్మిది మంది జ్యోతిరాదిత్య సింధియా వర్గమే కావడం గమనార్హం. ఇప్పటికే శివరాజ్ సింగ్ క్యాబినెట్‌లో ఇద్దరు సింధియా వర్గీయులుండటం గమనార్హం.

ఒకానొకప్పుడు రాహుల్ గాంధీకి సన్నిహితుడు చాలా కాలంపాటు కాంగ్రెస్ నేతగా కొనసాగిన జ్యోతిరాదిత్య సింధియా మార్చి నెలలో శివరాజ్ సింగ్ చౌహాన్‌కు మద్దతునివ్వడంతో కమల్ నాథ్ ప్రభుత్వం కూలిపోయింది. మార్చినెలలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఐదుగురు మంత్రలు ప్రమాణ స్వీకారం చేశారు. అప్పుడు కూడా అందులో సింధియా వర్గీయులున్నారు. తాజా విస్తరణలోనూ అతని వర్గీయులే తొమ్మిది మంది మంత్రులుగా బాధ్యతలు తీసుకున్నారు. జ్యోతిరాదిత్య సింధియా బంధువు యశోధర రాజే కూడా మంత్రిగా ప్రమాణం స్వీకారం చేశారు. శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రతిపాదించిన చాలా మందికి నిరాశే మిగిలిందని రాజకీయవర్గాలు తెలిపాయి.

ఈ నేపథ్యంలోనే బుధవారం ఆయన ‘చిలికితేనే అమృతం వస్తుందని, విషం కచ్చితంగా శివుడే తాగాల్సి ఉంటుంద’ని వ్యాఖ్యానించారు. కాగా, గురువారం కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ట్వీట్ చేశారు. మధ్యప్రదేశ్ ప్రజల సంక్షేమం కోసం కలిసిపనిచేస్తారని, కొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతారని ఆశిస్తున్నట్టు పేర్కొన్నారు. కాగా, మంత్రివర్గ విస్తరణ మార్చి నుంచి పెండింగ్‌లో ఉండటం వెనుక వర్గపోరు కారణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా, సొంతింటిలోనే సింధియాతో తొలి ఓటమిని శివరాజ్ సింగ్ చౌహాన్ చవిచూశారని మాజీ సీఎం కమల్ నాథ్ వ్యాఖ్యానించారు. సమర్థులైన బీజేపీ నేతలు క్యాబినెట్‌లో కనిపించకపోవడం దురదృష్టకరమని అన్నారు.


Next Story

Most Viewed