‘కెప్టెన్ 7’ యానిమేటెడ్ సిరీస్.. ధోనీ కథే ఇది

58

దిశ, స్పోర్ట్స్ : ఆట నుంచి రిటైర్ అయ్యాక ఎంతో మంది క్రికెటర్లు తమకు ఇష్టమైన రంగాల్లోకి వెళ్లారు. ద్రవిడ్ కోచ్ అవతారం ఎత్తితే.. కపిల్ గోల్ఫర్‌గా మారాడు. గవాస్కర్, మంజ్రేకర్, జడేజా, ఆకాశ్ చోప్రా వంటి వారు కామెంటేటర్లుగా రాణిస్తున్నారు. ఇక టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన తర్వాత వివిధ రంగాల్లోకి అడుగుపెట్టాడు. రాంచీలోని తన ఫామ్‌హౌస్‌లో వినూత్న పద్దతుల్లో వ్యవసాయం చేస్తున్నాడు. అంతకు ముందే అతడికి క్రీడా సంబంధిత వ్యాపార సంస్థ ఉన్నది. తాజాగా వినోద రంగంలోకి కూడా అడుగుపెడుతున్నాడు. ‘కెప్టెన్ 7’ పేరుతో ఒక యానివేషన్ సిరీస్ నిర్మిస్తున్నట్లు ధోనీ ప్రకటించాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ధోనీ జెర్సీ నెంబర్ 7.. అందుకే ఆ సిరీస్‌కి ‘కెప్టెన్ 7’ అనే పేరు పెట్టినట్లు తెలుస్తున్నది. పలు సిరీస్‌లుగా తెరకెక్కనున్న ఈ కెప్టెన్ 7 తొలి భాగం సీక్రెట్ ఏజెంట్ కథతో రూపొందినట్లు తెలుస్తున్నది. అయితే ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఇది ధోనీ కథే అంటా. ఒకవైపు గూఢచారి కథతో పాటు ధోనీకి ఇష్టమైన క్రికెట్, హాబీలు కూడా ఉంటాయంటా. ఈ విషయాన్ని స్వయంగా ధోనీనే వివరించాడు. ధోనీ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ మరో సంస్థతో కలసి ఈ సిరీస్ నిర్మిస్తున్నది. ప్రపంచవ్యాప్తంగా పలు ఓటీటీల్లో ఈ సిరీస్ విడుదల చేయనున్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..